అది సింగపూర్‌లోని ఓ నీటి సరస్సు. అక్కడ ఒడ్డున ఓ వింత జీవి కనిపించింది. దూరం నుంచి చూసిన వాళ్లు "వార్నీ మన సరస్సులో మొసళ్లు ఉన్నాయి. అదిగో ఆ మొసలి ఒడ్డుకి వచ్చింది చూడు" అని అనుకుంటూ దగ్గరకు వెళ్లారు. తీరా వెళ్లి చూస్తే... తల మొసలి తలలా ఉంది. మిగతా శరీరమంతా చేప శరీరంలా ఉంది. "ఇదేంటి ఇలా ఉంది... ఇది చేపా, మొసలా... లేక అనుకోకుండా ఇలా పుట్టిందా" అని రకరకాల డౌట్లు వచ్చాయి. విషయం స్థానిక నేషనల్ పార్క్స్ బోర్డ్ వారికి తెలిసింది. వారు వచ్చి... అది అత్యంత అరుదైన చేప అని... అమెరికా దక్షిణ ప్రాంతంలో ఇలాంటి చేపలు ఉంటాయని చెప్పారు. అంతేకాదు... ఇప్పుడున్న చేపలన్నింటి కంటే ముందు రోజుల్లో ఇలాంటి చేపలు ఉండేవని చెప్పారు. స్థానికులు అర్థమయ్యీ... అర్థం కానట్లుగా తలూపారు.
ఈ చేపలకు తల మాత్రం మొసలి తలలా ఉంటుంది. నోట్లో బలమైన దంతాలుంటాయి. అందువల్ల ఇవి సముద్రాల్లో ఏం కావాలన్నా ఈజీగా కొరికి తింటాయి. అందుకే అంత పెద్ద సైజు పెరుగుతున్నాయి. సింగపూర్ లో అత్యంత ప్రాచీనమైన మాక్ రిచీ రిజర్వాయర్ దగ్గర ఒడ్డున ఈ జీవి కనిపించింది.

వింత జీవి... మొసలి తల... చేప శరీరం (image credit - twitter)
స్కాట్లాండ్కి చెందిన కారెన్ లిత్గో (Karen Lythgoe) ఈ చేపపై ఓ డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి చూపించారు. కొంత మంది ఆ చేపను ఆశ్చర్యంగా చూస్తుంటే... తను కూడా అక్కడకు వెళ్లి చూశాననీ... ఆశ్చర్యంగా ఉండటంతో... అందరికీ చూపించాలని వీడియో తీశానని ఆమె తెలిపారు.
అది చేప అంటే లిత్గో నమ్మలేకపోతున్నారు. ఎంత ఆలోచించినా... అది మొసలి లాగే అనిపిస్తోందని అంటున్నారు. స్థానికులు కూడా ఇలాంటి చేప ఆ రిజర్వాయర్‌లోకి ఎలా వచ్చిందో, ఎప్పటి నుంచి అందులో ఉంటోందో అని ఆందోళన చెందుతున్నారు.

వింత జీవి... మొసలి తల... చేప శరీరం (image credit - youtube)
షాకింగ్ విషయమేంటంటే... ఇలాంటి చేపల వల్ల సముద్రాల, నదుల్లో మిగతా చేపలు, జీవ రాశికి ప్రమాదం. అందువల్ల అది చనిపోవడం మంచిదే అంటున్నారు. సింగపూర్ లా ప్రకారం... చేపలైనా జీవులైనా సరే వాటిని సరస్సులు, నదులు, చెరువుల్లోకి వదలకూడదు. వదిలితే చట్టపరంగా చర్యలుంటాయి.
అమెరికాకీ, సింగపూర్కీ 10వేల మైళ్లకు పైగా దూరం. మరి అక్కడ ఉండే చేప... ఇక్కడకు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఈ చేప పెట్టే గుడ్లు కూడా మనుషులు తింటే ప్రాణాంతకమట.