ఎవరైనా అంబులెన్స్(Ambulance) లను ఎమర్జెన్సీ (Emergency) సమయంలో వాడుకోవాలి. ప్రమాదం జరిగినా.. లేదా ఎవరికైనా ఆరోగ్యం (Health) బాగాలేకపోయినప్పుడు వాళ్లను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సర్వీసులను ఉపయోగించుకోవాలి. కానీ.. ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా.. నడవడం ఇష్టం లేక.. బద్ధకంతో అంబులెన్స్ సర్వీసులను ఉపయోగించుకున్నాడు. ఒకసారి, రెండు సార్లు తెలిసో.. తెలియకో పొరపాటు చేశాడు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అతడు ఇలా ఎన్నిసార్లు అంబులెన్స్ సర్వీస్ ను ఉపయోగించుకున్నాడో తెలుసా.. ఏకంగా ఒక సంవత్సరంలో 39 సార్లు అంబులెన్స్ సర్వీసును ఉచితంగా ఉపయోగించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తైవాన్ (Taiwan) కు చెందిన వాంగ్ అనే వ్యక్తి ఆసుపత్రికి సమీపంలో నివసిస్తున్నాడు. అయితే అతడు సూపర్ మార్కెట్ కు సరుకులు తీసుకోవడానికి వెళ్తుంటారు. ఆ మార్కెట్ అతడి ఇంటికి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. సాధారణంగా ఎవరైనా 200 మీటర్ల దూరం నడవడం అనేది పెద్ద సమస్య కాదు. సింపుల్ గా నడిచేయొచ్చు. అతడు నడవడానికి ఇష్టపడలేదు. ట్యాక్సీ మాట్లాడుకోవడానికి కూడా అతడి మనస్సు అంగీకరించలేదు. దానికి ఇక అతడు మాస్టార్ ప్లాన్ వేశాడు. అంబులెన్స్‌కు కాల్ చేసి తనకు అస్వస్థతగా ఉందని చెప్పి.. దాంట్లో ఫ్రీగా ప్రయాణం చేసేవాడు.
తను చెప్పిన ఆసుపత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్ సిబ్బందిని కోరేవాడు. సరే అతడి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా అని వాళ్లు కూడా అంగీకరించేవారు. అంబులెన్స్ ఆసుపత్రిలో అతడిని దింపగానే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయేవాడు. తన ఇల్లు ఆసుపత్రి పక్కనే ఉండటంతో అతడి ఆటలు ఇలా సాగాయి. ఇలా అతడు సంవత్సరంలో 39 సార్లు అంబులెన్స్‌ను ఉచిత ట్యాక్సీగా వాడేసుకున్నాడు. అయితే అతడు ఎలా బయటపడ్డాడంటే.. ఇలా ఆసుపత్రి వద్ద ఆంబులెన్స్ లో దిగి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా వెళ్లిపోవడం సిబ్బంది రెండు మూడు సార్లు గమనించారు.
ఓ రోజు ఇలానే వెళ్తుంటే.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతడిని పట్టుకొని విచారించంగా.. విషయం బయటకు వచ్చింది. పోలీసులు అతడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇంకోసారి అలా చేస్తే జైలులో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తైవాన్‌లో, అత్యవసర రోగులకు అంబులెన్స్‌లు ఉచితం. వారిని సమీపంలోని ఆసుపత్రులకు లేదా వైద్య సదుపాయాలకు తీసుకువెళ్లవచ్చు. వాంగ్ ఈ సౌకర్యాన్ని తన వ్యక్తిగతంగా పూర్తిగా ఉపయోగించుకున్నట్లు కనిపించింది. ఇది తెలుసుకున్న ఆ ప్రాంత వాసులు రోగులకు ఉపయోగించాల్సిన అంబులెన్స్ ను ఇలా ఉపయోగించడంతో అతడిపై మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Free ambulance, Taiwan, Viral image, VIRAL NEWS