అంతరిక్ష వ్యర్థంగా పిలిచే చిన్నపాటి ఉల్క ఒక వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. అతడి ఇంటిపై కూలిపోయిన ఆ ఉల్క రాత్రికి రాత్రే ఆ వ్యక్తిని కుబేరుడిగా మార్చింది. రూ.10 కోట్ల విలువైన ఆ స్పేస్ రాక్, దానితో పాటు అదృష్టాన్ని కూడా మోసుకొచ్చినట్లయింది. ఇండోనేషియాకు చెందిన జోషువా హుటగలుంగ్ అనే 33 ఏళ్ల వ్యక్తి పేరు ఇప్పుడు ఆ దేశమంతా మార్మోగుతోంది. ఉత్తర సుమత్రాలోని కోలాంగ్ అనే ప్రాంతంలో అతడు నివసిస్తుంటాడు. శవపేటికలు తయారుచేయడం అతడి వృత్తి. తన గదిపై ఉల్క కూలిపోయినప్పుడు అతడు శవపేటికను తయారు చేస్తున్నాడు. సుమారు 2.1 కిలోల బరువున్న స్పేస్ రాక్ పైకప్పు గుండా దూసుకొచ్చి, 15 సెం.మీ లోతు వరకు వెళ్లింది.
స్వచ్ఛతను బట్టి విలువ..
స్వచ్ఛతను, బరువును బట్టి ఉల్కల ధరను నిర్ణయిస్తారు. మలినాలు ఉండేవి. పూర్తిగా శిలల మాదిరిగా ఉండే ఉల్కల ధరలు గ్రాముకు 0.50 డాలర్ల నుంచి 5.00 డాలర్ల వరకు ఉంటాయి. అరుదైన లోహాలతో ఉండే ఉల్కలకు చాలా విలువ ఉంటుంది. ఇలాంటి వాటికి ఒక గ్రాముకే 1,000 డాలర్లు పలుకుతుంది. తన గదిలో పడి ఫ్లోరింగ్ నుంచి భూమి లోపలికి దూసుకుపోయిన ఉల్కను బయటకు తీస్తున్నప్పుడు, అది కొంతవరకు విరిగిపోయిందని జోషువా చెప్పాడు. దాన్ని బయటకు తీసేటప్పుడు ఇంకా వెచ్చగా ఉందని అతడు వివరించాడు.
అరుదైన రకం..
ఈ ఉల్క 4.5 బిలియన్ సంవత్సరాల నాటిదని పరిశోధకులు అంచనా వేశారు. ఇది చాలా అరుదైన CM1/2 కార్బోనేషియస్ కొండ్రైట్ (CM1/2 carbonaceous Chondrite) రకానికి చెందినదని వారు తెలిపారు. ఇలాంటి స్పేస్ రాక్ ధర ఒక గ్రాముకు 857 డాలర్లు పలుకుతుందట. ఈ లెక్కన జోసువా 1.85మిలియన్ డాలర్లను సొంతం చేసుకున్నాడు.
వరించిన అదృష్టం..
"అది ఇంటిపై పడినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. ఇల్లు కూడా షేక్ అయ్యింది. ముందు నేను భయపడ్డాను. ఆ తరువాత గమనిస్తే ఇంటి పైకప్పుకు రంధ్రం ఏర్పడింది. దీంతో ఆకాశం నుంచి ఏదో పడిందనిపించింది. దాన్ని తవ్వి బయటకు తీసినప్పుడు ఆ రాయి ఇంకా వెచ్చగానే ఉంది" అని జోషువా స్థానిక వార్తా సంస్థలతో చెప్పాడు. ‘నేను అదృష్టవంతుడినని అందరూ చెబుతున్నారు. నాకు ఎప్పటి నుంచో ఒక పాప పుట్టాలని కోరుకుంటున్నాను. దురదృష్టం పోయినందున ఇప్పుడైనా నా కోరిక తీరుతుందని భావిస్తున్నాను’ అని జోషువా చెబుతున్నాడు. ఈ ఉల్క ద్వారా అతడు 30 సంవత్సరాల జీతంతో సమానమైన డబ్బును ఒకేసారి సొంతం చేసుకున్నాడట. తనకు వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని చర్చి నిర్మించడానికి ఇస్తానని అతడు చెప్పాడు.
Published by:Nikhil Kumar S
First published:November 19, 2020, 21:07 IST