బీహార్‌లో నిర్వహించిన ఒక పోటీ పరీక్షలో పాస్ అయింది సినీ నటి అనుపమ పరమేశ్వరన్. ఏంటీ కేరళలో ఉంటూ, టాలీవుడ్‌లో సినిమాలు చేసే అనుపమ పరమేశ్వరన్ బీహార్‌లో పరీక్ష రాసిందా.. అనుకుంటున్నారా? మార్కుల లిస్ట్ చూస్తే.. ఇదంతా నిజమే అని మీరు కూడా అనుకుంటారు. అసలు బీహార్‌కి అనుపమ పరమేశ్వరన్‌కి సంబంధం ఏంటి అనేది మీరే చదివేయండి.
బీహార్‌లో ఇటీవల సెకండరీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్టెట్) ఫలితాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితం జరిగిన పరీక్షల ఫలితాలు అవి. అందులో అందరి ఫలితాలు ఎలా వచ్చాయనేది పక్కనపెడితే ఓ అభ్యర్థి ఫలితం మాత్రం భలే విచిత్రంగా వచ్చింది. ఆ కుర్రాడి పేరు హ్రిషికేశ్ కుమార్... అయితే ఫొటోలో ఉన్నది మాత్రం ఓ అమ్మాయి. దాంతో అందరూ డౌట్ వచ్చి... ఇదేంటి అబ్బాయి పేరుకి అమ్మాయి ఫొటో అని జూమ్ చేసి చూశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
హ్రిషికేశ్ ఫొటో బదులు అక్కడ కనిపిస్తోంది బాగా తెలిసిన ముఖమే అని కొందరు అనుకున్నారు. కాసేపటికి ఈమె సినిమా హీరోయిన్‌లా ఉందనే పసిగట్టారు. వెంటనే గూగుల్ సెర్చ్ ద్వారా ఆ ఫొటోను సెర్చ్ చేసి చేశారు. ఇంకేముంది ఆమె మన అనుపమ పరమేశ్వరన్ అని తేలింది. దీంతో అవాక్కైపోవడం వారి వంతైంది. అయితే ఆ మార్కుల లిస్ట్ ప్రకారం అనుపమ మూడు సబ్జెక్ట్‌ల మార్కులే కనిపిస్తున్నాయి. మిగిలిన మార్కులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అప్‌డేట్ కాలేదట.
దీనికి సంబంధించిన వీడియోను బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ట్విటర్‌లో రీట్వీట్ చేశాడు. దీంతో ఇవి వైరల్ అయింది. మరోవైపు ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇలా ఫొటో రావడం వారి ఆరోపణలకు బలమిచ్చేలా తయారైంది. అయితే తేజస్వియాదవ్ ఆరోపణలను అధికార జనతా దళ్ (యూ) కొట్టిపారేసింది. భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించినప్పుడు ఇలా పొరపాట్లు జరుగుతాయని పార్టీ ప్రతినిధి అంటున్నారు.
తప్పులను సరిదిద్దుకొని రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని జనతాదళ్ (యూ) చెబుతోంది. స్టెట్ పరీక్షలో తొలి పేపర్‌కు ఎలిజిబుల్ అయినవారు 9, 10 తరగతులకు పాఠాలు చెబుతారు. పేపరు 2కు క్వాలిఫై అయినవారు 11, 12 తరగతులకు పాఠాలు చెబుతారు. అయితే బీహార్‌లో ఇలా హీరోయిన్ల ఫొటోలు పరీక్షల ఫలితాల్లో రావడం ఇదే తొలిసారి కాదు. 2019లో బాలీవుడ్ నటి సన్నీ లియోని ఫొటో కూడా ఇలానే బీహార్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ (పీహెచ్‌ఈడీ) మెరిట్ లిస్ట్‌లో వచ్చింది. జూనియర్ ఇంజినీరింగ్ పరీక్షలో సన్నీకి 98.50 పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత పీహెచ్‌ఈడీ పరీక్ష సిబ్బంది తేరుకొని... పొరపాటు సరిదిద్దారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anupama Parameswaran