MAHARASHTRA LATUR MAN ANIL TUKARAM GAIKWAD WAS BITTEN BY SNAKES FOR 500 TIMES IN LAST 15 YEARS MKS
పున్నమినాగు 2.0: ఒకే వ్యక్తికి 500 సార్లు పాము కాటు.. జనం మధ్యలో ఉన్నా పగపట్టినట్టు అతణ్నే!!
బాదితుడు అనిల్ గైక్వాడ్ కు డాక్టర్ రణవేది చికిత్స
పున్నమినాగు 2.0 ఇతనేనా? అనేంత స్థాయిలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 500 సార్లు పాము కాటుకు గురైనా బతికే ఉన్నాడు. అతని నిజజీవిత కథలో ఆశ్చర్యాలతోపాటు విషాదమూ ఉంటుంది..
చిరంజీవి మెగాస్టార్ కాకముందు నటించిన పున్నమినాగు సినిమా గుర్తుందికదా? పాముల నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో ఎన్నిసార్లు పాము కాటుకు గురైనా చిరంజీవికి ఏమీ కాదు. కారణం.. చిన్నప్పటి నుంచి అతను విషానికి విరుగుడు తింటూ పెరుగుతాడు. అది కల్పిత కథ కాబట్టి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ పున్నమినాగు 2.0 ఇతనేనా? అనేంత స్థాయిలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 500 సార్లు పాము కాటుకు గురైనా బతికే ఉన్నాడు. అతని నిజజీవిత కథలో ఆశ్చర్యాలతోపాటు విషాదమూ ఉంటుంది..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 54లక్షల పాము కాటు ఘటనలు రికార్డవుతుంటాయి. తద్వారా ఏటా 1.37 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ లోనైతే పాముకాట్లకు ఏటా 58వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యధికంగా పాము కాటు మరణాలు చోటుచేసుకునే రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ముందుంది. ఆ రాష్ట్రంలోని లాతూర్ జిల్లాలోగల ఔసా అనే పట్టణానికి చెందిన వ్యక్తి అనిల్ తుకారామ్ గైక్వాడ్. ఇతను గడిచిన 15 ఏళ్లలో సుమారు 500 సార్లు పాము కాటుకు గురయ్యాడు.
ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదివాస్తవం. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే అనిల్ గైక్వాడ్ పాముకాటు కారణంగా చాలా సార్లు పరిస్థితి విషమించి చావు అంచులదాకా వెళ్లొచ్చాడు. పొలం పనులు చేస్తున్న సమయాల్లోనేకాదు పట్టణ ప్రాంతాల్లో జనం మధ్య సంచరించే సమయంలో కూడా అతను పాము కాట్లకు గురయ్యాడు.
అనిల్ గైక్వాడ్ పాము కాటుకు గురైన ప్రతిసారి కుటుంబీకులు భారీగా ఖర్చు చేసి అతనికి చికిత్స అందించి బతికించుకుంటున్నారు. అయితే.. 15 ఏళ్లపాటు దాదాపు 500 సార్లు పాము కాటుకు గురైన అనిల్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ పాములు పగపట్టినట్లుగా ఇతణ్నే ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావట్లేదని డాక్టర్లు వాపోతున్నారు.
అనిల్ కు 150సార్లకుపైగా వైద్యం చేసిన డాక్టర్ రణవేది కూడా ఇదే మాట చెబుతున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన అనిల్ గైక్వాడ్ పరిస్థితి ఎప్పటికి మారుతుందోనని కుటుంబీకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.