మీకందరికీ కుందేలు.. తాబేలు కథ గుర్తుంది కదా..? ఆ రెండూ ఒక పోటీ పెట్టుకుంటాయి. ఆ రెండింటిలో ముందు ఎవరు వస్తారోననేది పందెం. అనుకున్నట్టుగానే కుందేలు.. ముందు పరిగెడుతుంది. తాబేలు వెనకలా మెల్లగా వస్తుంది. అది చూసిన కుందేలు.. ‘ఆ.. అది మన దగ్గరకు వచ్చేసరికి వెళ్లొచ్చులే.. ’అని పక్కన పడుకుంటుంది. కానీ తాబేలు మాత్రం మెల్లగా వచ్చినా.. పరుగు పందెంలో గెలుస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకనుకుంటున్నారా..? ఈ కథలో ఒక గొప్ప నీతి దాగి ఉన్న విషయం తెలిసిందే కదా.. ఆ నీతికి సంబంధించిన ఘటనే మరొకటి ఈ మధ్యే సోషల్ మీడియాలో వైరలవుతున్నది.
మనమందరం చిన్నప్పుడు చెంచాలో నిమ్మకాయ ఉంచి దానిని నోట్లో పెట్టుకుని ఆడిన ఆట గుర్తుంది కదా.. ఆ ఆట మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నది. దాని ద్వారా ఒక పిల్లాడు అద్భుతమైన పాఠాన్ని చెప్పకనే చెబుతున్నాడు. అదేంటి.. ఫోన్లలో గేమ్ లు ఆడుకుంటున్న రోజుల్లో ఆ ఆట ఎవరాడుతున్నారనుకుంటున్నారా..?అతడు చెబుతున్న నీతి పాఠం... ‘నిదానమే ప్రధానం..’
వీడియోలో పలువురు విద్యార్థులు చెంచాలో నిమ్మకాయ వేసి ఉంచగా.. వారందరూ విజిల్ వేయగానే ఆదరాబాదరగా బయలుదేరారు. కానీ మధ్యలోనే వారి నోట్లో ఉన్న చెంచాల్లోంచి నిమ్మకాయలు కింద పడిపోయాయి. ఒక పిల్లవాడు మాత్రం మెల్లగా.. ఏకాగ్రతతో నడుస్తూ గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు చెందిన ఆఫీసర్ సుధా రామన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఈ వీడియోను ఆమె పోస్టు చేస్తూ.. ‘నిదానమే ప్రధానం..’ అనే సత్యం మరోసారి నిరూపితమైంది అని రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ పాత స్మృతుల్లోకి వెళ్తున్నారు. చిన్నప్పుడు తాము కూడా ఈ గేమ్ తెగ ఆడేవాళ్లమనీ, మంచి సందేశం ఇచ్చారని కొనియాడారు. ఇందుకు సంబంధించి తెలుగిళ్లలోనూ ఒక ఫేమస్ సామెత ఉంది.. ‘పరిగెత్తి పాలు తాగేకంటే నిల్చుండి నీళ్లు తాగింది ఉత్తమం అని..’
Published by:Srinivas Munigala
First published:October 28, 2020, 12:57 IST