ఈ మధ్య ఈడ్చుకెళ్లడం ఫ్యాషన్ అయిపోనట్లుంది. కారు ఉంటే చాలు.. ఏదో ఘనకార్యం చేసినట్లు బైకులను, మనుషులను.. దారికి ఏదీ వస్తే దాన్ని ఈడ్చుకెళ్లుతున్నారు. మరి తల పొగరుతో కారు డ్రైవ్ చేస్తున్నారో.. తాగి డ్రైవ్ చేస్తున్నారో తెలియదు కానీ.. ఢిల్లీ కంఝవాలా ఘటన మరవకముందే హర్యానాలో అలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌లో జరిగిందీ షాకింగ్ ఘటన. ఓ హోండా సిటీ కారు బైకును ఈడ్చుకెళ్లింది. ఇతర ప్రయాణికులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా బైక్‌ను తన కారుతో ఈడ్చుకెళ్లాడు డ్రైవర్.
Road rage incident witnessed in gurugram sector 62 where a bike was hit by a car and then was dragged for 4 kms , acc to police 2 people were on the bike. This is the third Hit and run incident in span of 2months in NCR. #gurugramroadrage #hitandrun #roadrage @gurgaonpolice pic.twitter.com/qSZeTajoi4
— Harsha chandwani (@harsha19chand) February 2, 2023
తాగి నడిపాడా..?
గురుగ్రామ్‌లోని సెక్టార్ 65లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. మోనూ అనే వ్యక్తి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. దారి మధ్యలో ఏదో పని మీద రోడ్డు పక్కన తన బైక్‌ను పార్క్ చేశాడు. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన హోండా సిటీ కారు.. బైక్‌ను ఢీ కొట్టింది. ఆ బైక్ కారు కింద ఇరుక్కుపోయింది. బైక్‌ను కారు ఈడ్చుకెళ్లిన సమయంలో రోడ్డుపై నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. అయినా కూడా డ్రైవర్ కారును ఆపలేదు. ఇలా మూడు కిలోమీటర్లు బైక్‌ను ఈడ్చికెళ్లాడు. ఈ నిప్పు రవ్వలను చూసి రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. పలువురు ఆ కారును వెంబడించారు. ఈ సమయంలోనే వీడియో రికార్డు చేసి సోషల్‌మీడియాలో పెట్టారు. డ్రైవింగ్ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. మరి తాగింది దిగిందో ఏమో కానీ మూడు కిలోమీటర్ల తర్వాత కారును ఆపాడు డ్రైవర్. అయితే వెంటనే కారు రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. ఇక మోను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు నంబర్ ఆధారంగా నిందితుడిని ఫరీదాబాద్‌కు చెందిన సుశాంత్ మెహతాగా గుర్తించారు. నిందితుడు సెక్టార్ 63లో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సుశాంత్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని కంఝవాలాలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... తరుచుగా అలాంటి ఘటనలే అనేక రాష్ట్రాల్లో జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.