తమిళనాడు నీలగిరి జిల్లాలోని పందలూరు దగ్గరున్న కొండ గ్రామం కైవట్టా శివార్లలో ఒక చిరుత పులి ఊరి చివర కనిపించింది. వెంటనే అలర్టైన ఊరి ప్రజలు గట్టిగా కేకలు వేస్తూ... నానా రకాలుగా హడావుడి చేశారు. ఆ అరుపులు, కేకలకు వెనక్కి తగ్గిన చిరుత... అటు నుంచి అటే వెళ్లిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐతే... రైతు రాయిన్ తోటలో పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ టైంలో మంచం కింద ఏదో సౌండ్ వినిపించింది. కిందికి చూడగా చిరుత పులి కనిపించింది. అంతే గుండె ఆగినంత పనైంది. అంతకుముందు పొలాల్లో కనిపించిన అదే చిరుత తన ఇంట్లో మంచం కింద ఉండటాన్ని చూసి కూడా నమ్మలేనట్లు అయిపోయింది అతని పరిస్థితి. ఏం చెయ్యాలో కాళ్లూ, చేతులూ ఆడలేదు. వెంటనే అరుస్తూ విషయం తన భార్యకు చెప్పాడు. వంటగదిలో ఉన్న ఆమె... అటు నుంచీ అటూ ఇంట్లోంచీ బయటకు పరుగులు పెట్టింది. ఇలా ఇద్దరూ బయటకు వచ్చి... వెంటనే తలుపులు మూసేసి... తాళం వేసేశారు.
విషయం ఊరోళ్లకు తెలియడంతో చిరుతను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఎంత పెద్దగా ఉంది, ఎలా చూస్తుందో చూడు... అంటూ అందరూ దాని గురించి రకరకాలుగా చెప్పుకున్నారు. విషయం తెలిసి అటవీ శాఖ అధికారులు కూడా రాయిన్ ఇంటికి వచ్చారు. చిరుతపులికి మత్తు ఇచ్చి లేదా వల వేసి పట్టుకోవాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి కావడంతో బుధవారం ఉదయం చిరుతను పట్టుకుంటామని తెలిపారు.
ఆల్రెడీ చిరుత ఇంట్లోనే ఉంది కాబట్టి... దాన్ని బంధించడం పెద్ద మేటర్ కాదు. కాకపోతే... ఇలా చిరుత ఇంట్లోకి వచ్చేస్తే... ఇక రక్షణ ఎక్కడ? మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత... జనంపై దాడి చేసి పారిపోయింది. అంతకుముందు పుణెలోని ఓ అపార్ట్మెంట్లోకి చిరుత వచ్చేసింది. ఏడుగురిపై దాడి చేసింది. గత వారం నాశిక్‌లో ఓ ఊర్లోకి చిరుత ప్రవేశించి నలుగురిని గాయపరిచింది. ఇలా తరచుగా చిరుత పులులు... జనావాసాల్లోకి వచ్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
Video: ఆత్రేయపురంలో చిరుత హల్చల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Save Tigers, Tiger Attack