Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 14, 2020, 10:38 AM IST
శోభా నాయుడు కన్నుమూత (Shobha Naidu passed away)
ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ అక్టోబర్ 14 తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఈమె ఆరోగ్యం అంత బాగోలేదు. సెప్టెంబర్‌లో ఈమె ఇంట్లో జారిపడటంతో ఆమె తలకు గాయమైంది. అప్పట్నుంచి శోభా నాయుడు ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జారిపడిన రోజు నుంచి కూడా ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు ఈవిడ. ఇదే క్రమంలో ఆమెకు కరోనా కూడా సోకింది. దాంతో శోభా నాయుడు ఆరోగ్యం మరింత క్షీణించింది. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అక్కడ ఆమెకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసారు. శోభా నాయుడు 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు.

శోభా నాయుడు కన్నుమూత (Shobha Naidu passed away)
క్వీన్స్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో ఆరంగేట్రం చేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా ఈమె ఎన్నో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలోని అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించి మెప్పించిన శోభా నాయుడుకు కేంద్రం 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మద్రాస్‌లోని కృష్ణ గాన సభ నుంచి నృత్య చూడామణి బిరుదు కూడా అందుకున్నారు శోభా నాయుడు. అలాగే 1991లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు,1996లో నృత్య కళా శిరోమణి అవార్డు,1998లో ఎన్టీఆర్ అవార్డు,ఏపీ ప్రభుత్వ హంస అవార్డులను అందుకున్నారు.

శోభా నాయుడు కన్నుమూత (Shobha Naidu passed away)
40 ఏళ్లుగా కూచిపూడి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న శోభా నాయుడుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యులున్నారు. శోభా మరణవార్తతో ఒక్కసారిగా అంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నాట్యకళా ప్రపంచంలో ఓ లెజెండ్‌ను కోల్పోయిందంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శోభానాయుడు మృతికి అధికార భాషా సంఘం అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.వి.సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 14, 2020, 10:38 AM IST