LAWYER APPEARS AS CAT AFTER A ZOOM FILTER MISHAP IN VIRTUAL COURT HEARING IN US SK GH
Viral Video: పిల్లే లాయర్.. కోర్టు విచారణలో సరదా సన్నివేశం.. వీడియో చూస్తే నవ్వాగదు
జూమ్ సెషన్లో పిల్లిలా కనిపించిన లాయర్
స్థానిక కోర్టులో వర్చువల్ విధానంలో విచారణ జరుగుతుండగా.. జూమ్ లైవ్ స్ట్రీమింగ్‌లో లాయర్‌కు బదులుగా ఒక పిల్లి కనిపించింది. దీంతో కోర్టు సమయం కాసేపు వృథా అయ్యింది.
కరోనా తరువాత అన్ని కోర్టుల కార్యకలాపాలు వర్చువల్ విధానంలోకి మారాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ, మరి కొన్ని రోజుల వరకు కోర్టుల్లో వర్చువల్ విచారణే అమల్లో ఉండనుంది. ఈ విధానంలో ఎదురవుతున్న కొన్ని టెక్నికల్ సమస్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టెక్సాస్‌లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. స్థానిక కోర్టులో వర్చువల్ విధానంలో విచారణ జరుగుతుండగా.. జూమ్ లైవ్ స్ట్రీమింగ్‌లో లాయర్‌కు బదులుగా ఒక పిల్లి కనిపించింది. దీంతో కోర్టు సమయం కాసేపు వృథా అయ్యింది. టెక్సాస్‌లోని 394వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ కోర్టు జడ్జి రాయ్ ఫెర్గూసన్‌కు ఎదురైన ఈ వింత సంఘటన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. జూమ్ కాల్లో జరిగిన వర్చువల్ విచారణలో.. లాయర్ రాడ్ పోంటన్ వాదించే అవకాశం వచ్చింది. కానీ కెమెరా ఆన్ చేయగానే.. పోంటన్కు బదులుగా ఒక పిల్లి స్క్రీన్‌పై కనిపించింది.
జూమ్ సెట్టింగ్స్‌లో ఏదో ఫిల్టర్ ఆన్ అయ్యి ఉంటుందని జడ్జి భావించారు. ఈ విషయం లాయర్ పోంటన్కు తెలియకపోవడంతో అతడు తికమక పడ్డాడు. ‘మిస్టర్ పోంటన్.. వీడియో సెట్టింగ్స్‌లో మీరు ఫిల్టర్ ఆన్ చేశారనుకుంటా.. ఒకసారి చెక్ చేసుకోండి’ అని జడ్జి చెప్పారు. లాయర్ దీన్ని గ్రహించలేదు. కొన్ని సెకన్ల తరువాత కూడా పిల్లి స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది. కానీ మాటలు మాత్రం లాయర్వి వినిపిస్తున్నాయి. ‘నా మాట వినిపిస్తుందా జస్టిస్’ అని పోంటన్ అడిగారు. కానీ పిల్లి మాట్లాడుతున్నట్లుగానే వీడియోలో కనిపించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా కాసేపు నవ్వుకున్నారు. ఆ తరువాత లాయర్ ఇతరుల సాయంతో జూమ్ ఫిల్టర్ ఆపేశాడు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.
సెట్టింగ్స్ ఎలా మారాయంటే.?
తన కంప్యూటర్ను పిల్లలు వాడినప్పుడు జూమ్‌లో క్యాట్ ఫిల్టర్ ఆన్ చేశారని లాయన్ పోంటర్ వివరించారు. ఇలాంటి ఫీచర్ ఒకటి ఉందని తనకు అప్పటి వరకు తెలియదన్నారు. కరోనా వల్ల టెక్సాస్‌లో అన్ని రకాల కోర్టు ప్రొసీడింగ్స్ వర్చువల్ విధానంలోనే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పది లక్షల వరకు వర్చువల్ విచారణలు నిర్వహించినట్లు జడ్జి ఫెర్గూసన్ తెలిపారు. ప్రస్తుత సంఘటన ఒక జోక్ లాంటిది కాదని ఆయన చెప్పారు. ఇలాంటి టెక్నికల్ సమస్యలు అప్పుడప్పుడూ ఎదురవుతూనే ఉంటాయన్నారు. జూమ్ వీడియో కాల్స్‌ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ట్విటర్ట్లో ఒక పోస్ట్ చేశారు. ‘ఒకవేళ మీ కంప్యూటర్ను పిల్లలు వాడుతుంటే.. మీరు జూమ్ వర్చువల్ హియరింగ్‌లో చేరడానికి ముందు ఫిల్టర్లు ఆఫ్ చేసి ఉన్నాయో లేదో సరిచూసుకోండి. సమయం వృథా కాకుండా జాగ్రత్త పడండి’ జడ్జి ట్వీట్ చేశారు. ఈ వైరల్ విచారణకు సంబంధించిన వీడియో లింక్‌ను కూడా ఆయన పోస్ట్ చేశారు.
IMPORTANT ZOOM TIP: If a child used your computer, before you join a virtual hearing check the Zoom Video Options to be sure filters are off. This kitten just made a formal announcement on a case in the 394th (sound on). #lawtwitter#OhNo@zoom_ushttps://t.co/I0zaj0wu6K
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా ఫన్నీగా ఉందని.. వర్చువల్ మీటింగ్స్‌లో ఇంకెన్ని విచిత్రాలు చూడాలో అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.