Lamborghini-Cerevelo R5 Bicycle: ప్రపంచ దిగ్గజ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ- లంబోర్గిని మార్కెట్లోకి ఒక కొత్త లగ్జరీ బైక్ సైకిల్‌ను విడుదల చేసింది. సైకిల్ తయారీ కంపెనీ సెర్వెలోతో కలిసి సంయుక్తంగా రూపొందించిన ఈ బైక్ సైకిల్ ఔత్సాహికులను విశేషంగా ఆకర్షిస్తోంది. సెర్వెలో ఆర్5 పేరుతో వస్తోన్న ఈ బైక్ సైకిల్ ధర ఎంతో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. దాని ప్రారంభ ధరే రూ.13.2 లక్షలు. ఈ రెండు సంస్థలూ కలిసి సెర్వెలో ఆర్5ను అల్ట్రా-లిమిటెడ్ ఎడిషన్ స్ర్టీట్ బైక్ గా రూపొందించాయి. దీన్ని స్పోర్ట్స్ బైక్‌గా, సైకిల్గానూ వాడుకోవచ్చు. లంబోర్గిని కంపెనీకి మంచి పేరు తీసుకొచ్చిన అవెంటడార్ SVJ కారును స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తయారు చేశారు. అవెంటడార్ SVJ.. 2018 లో ఆరు గంటల 44నిమిషాల 97సెకన్లతో నార్బర్గ్రింగ్ నార్డ్స్‌క్లీఫ్ సర్క్యూట్లో రికార్డు సృష్టించింది. ఈ కారును పూర్తిగా ఇటలీలో తయారు చేసిన భాగాలతోనే రూపొందించారు.
63 యూనిట్లే ఉత్పత్తి
ఇటలీలోని సాంట్ అగాటా బోలోగ్నీస్లో 1963లో లంబోర్గిని కంపెనీని స్థాపించారు. దీనికి గుర్తుగా కేవలం 63 సెర్వెలో ఆర్5 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. ఈ బైకు రెండు బ్రాండ్ల విలువలను ప్రతిబింబిస్తుందని లంబోర్గిని, సెర్వెలో సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిమిత ఎడిషన్ స్ట్రీట్ బైక్ రూపకల్పనలో పేరున్న ఇటలీ సంస్థల విడిభాగాలను ఎంచుకున్నారు. కాంపాగ్నోలో సూపర్ రికార్డ్ ఇపిఎస్ కంపెనీ ఆర్5 బైక్‌ను అసెంబుల్ చేసింది. దీనికి వాడిన వీల్స్‌ను కాంపాగ్నోలో బోరా వన్ సంస్థ తయారు చేసింది. డేడా ఎలిమెంటీ కంపెనీ స్టెమ్, విట్టోరియా కోర్సా ప్రో కంపెనీ టైర్లు దీని తయారీలో వాడారు. వీటన్నింటి విలువను కలుపుకుని దీని రిటైల్ ధరను రూ.13.2 లక్షలు(1,80,000 డాలర్లు)గా నిర్దారించారు.
దీనికి ముందు లంబోర్గిని, సెర్వెలో కంపెనీలు 2018లో కూడా ఓసారి జట్టుకట్టాయి. అప్పట్లో అవి సెర్వెలో పి5ఎక్స్ లంబోర్గిని పేరుతో ఓ సైకిల్‌ను రూపొందించాయి. దాని ధర 15,000 డాలర్లు. అప్పట్లో కేవలం 25 యూనిట్లనే ఆ సంస్థలు ఉత్పత్తి చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles