విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుంది. అయితే కేరళలో ఓ పాఠశాల టీచర్లు విద్యార్థుల ఇంట్లోనూ వెలుగును నింపే ప్రయత్నం చేశారు. కేరళలోని వడకర సమీపంలో ఉన్న కీజల్ యూపీ స్కూల్లో కొంత మంది ఉపాధ్యాయులు.. విద్యార్థులకు ఆపన్నహస్తంగా మారారు. ఓ విద్యార్థి ఇంట్లో విద్యుత్ వైరింగ్ పనిచేసి వెలుగు తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల్లో ఒకరైన శ్రీజన్ ఈ బాధ్యత తీసుకున్నారు. ఆన్‌లైన్ లేదా టీవీ క్లాసులకు విద్యార్థులు హాజరవుతున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయుల బృందం వారి ఇళ్లకు వెళ్లింది. ఆ సమయంలో ఒక విద్యార్థి ఇంటికి విద్యుత్ కనెక్షన్ లేదని వారు గుర్తించారు. నిర్మాణంలో ఉండటంతో, విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో వైరింగ్ కోర్సును పూర్తి చేసిన శ్రీజన్ అనే ఉపాధ్యాయుడు.. సదరు విద్యార్థి ఇంట్లో వైరింగ్ పూర్తి చేయాలని సంకల్పించారు. సాధ్యమైనంత త్వరలో విద్యుత్ పనులు పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇతర ఉపాధ్యాయులైన పీ రమేశన్, అర్జున్, ఫహాద్, జీజీష్, ఫైజల్ కూడా సాయం చేశారు.
అందరూ కలిసి పెండింగ్‌లో ఉన్న ఇతర పనులను పూర్తి చేశారు. నెల తర్వాత ఆ ఇల్లు విద్యుత్ దీపాలతో వెలిగిపోయింది. విద్యార్థి ఇంటికి వైరింగ్ కేవలం ఒకటిన్నర రోజుల్లో పూర్తయింది. ఇల్లు నిర్మాణం రాతి భూభాగంపై ఉన్న కారణంగా ఎర్తింగ్ పని కొంచెం కష్టమైంది. దీంతో సంబంధిత విద్యుత్ శాఖ అధికారిని సంప్రదించామని శ్రీజన్ తెలిపారు. రెండు అదనపు ఎలక్ట్రికల్ ఎర్తింగ్స్ వేసి సమస్య పరిష్కరించామని ఆయన వివరించారు. పాఠశాల మేనేజ్‌మెంట్ సైతం తమ వంతు సాయం చేసింది. వైరింగ్, ఇతర విద్యుత్ పరికరాలను అందించింది. దాదాపు 20 రోజుల నిరీక్షణ తర్వాత.. ఈ సోమవారం నుంచి విద్యార్థి ఇంటికి విద్యుత్ సరఫరా ప్రారంభమైంది.
బల్బు వెలగడం చూసిన చిన్నారి విద్యార్థి ముఖంలో చిరునవ్వు అద్భుతంగా అనిపించిందని శ్రీజన్ హర్షం వ్యక్తం చేశారు. DYFI స్థానిక కమిటీ.. ఆ విద్యార్థికి ఒక మొబైల్ అందించింది. ఆన్ లైన్ క్లాసుల కోసం ఈ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందివ్వడానికి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సంఘం, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, యాజమాన్యం చేతులు కలిపాయని ప్రధానోపాధ్యాయురాలు జయంతి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Private teachers, Students