Kerala Plane Crash : విమాన ప్రమాదాలకు రకరకాల కారణాలుంటాయి. కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల జరిగితే... మరికొన్ని పైలెట్ల తప్పిదాల వల్ల జరుగుతాయి. నిన్న కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో పైలెట్ దీపక్ వసంత సాథే... అత్యంత అనుభవం ఉన్నవారు. అయినప్పటికీ... ఆ విమానం రన్‌వేపై దిగేటప్పుడే... కుదుపులకు లోనై... రన్‌వేపై ఇష్టారాజ్యంగా దూసుకుపోతూ... పక్కనే ఉన్న లోయలోకి జారిపోతూ... రెండు ముక్కలైపోయిందంటే... ఆ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని క్షణాల్లో క్షేమంగా ఎయిర్పోర్ట్ చేరాల్సిన 20 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పైలెట్, కోపైలెట్ కూడా ఉన్నారు. దీపక్ వసంత సాథే... ఇదివరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేశారు. ఖరాక్వస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో 58వ కోర్స్‌కి చెందిన ఆయన... NDA తరపున... స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్ కూడా పొందారు.
ఎంత అనుభవం ఉన్నా... విమాన ల్యాండింగ్ అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ల్యాండింగ్ సమయంలో ఏమాత్రం పట్టు తప్పినా... విమానాలు... ఇష్టమొచ్చినట్లు వెళ్లిపోతాయి. నిన్న రాత్రి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో... ఆల్రెడీ వర్షం పడటం వల్ల రన్‌వే చిత్తడిగా ఉంది. అందువల్ల విమానం దిగగానే... టైర్లు జారి ఉంటాయనే అనుమానం ఉంది. అందువల్ల విమానం లోయలోకి వెళ్లిపోయిందని అనుకుంటున్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఘటన జరిగినప్పుడు... ఎయిర్‌పోర్టులో విజిబులిటీ 2000 మీటర్లుగా ఉందని... పైగా... అక్కడ వర్షం కూడా పడుతుండటం వల్ల... ప్రమాదం జరిగి... విమానం 30 అడుగుల లోతున్న లోయలోకి జారిపోయిందంటున్నారు.
ఎంతో అనుభవం ఉన్న పైలెట్ అయిన దీపక్ వసంత సాథే కూడా విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయారంటే... ప్రమాదం ఏ స్థాయిలో జరిగివుంటుందో ఊహించుకోవచ్చని ఎయిర్ మార్షల్ పీకే బార్బోరా అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో సాథే కూడా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు.
భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోజికోడ్ రన్‌వే విమానాలు దిగడానికి సరైనది కాదని తొమ్మిదేళ్ల కిందటే ఒక నివేదికలో వివరించారు ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కెప్టెన్ మోహన్ రంగనాథన్. అప్పట్లోనే ఆయన ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. అంచనాకు తగ్గట్లే అది ఇప్పుడు జరిగినట్లైంది. ఇకపై ఇలా జరగకుండా ఉండేందుకు ఏం చెయ్యాలనే అంశంపై దర్యాప్తు రిపోర్ట్ వచ్చాక... కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.