కోడి పుంజులంటే కొందరికి ఎంతో ప్రాణం. వాటిని సొంత పిల్లల్లానే చూసుకుంటారు. బెళగావిలోని ఓ ఫ్యామిలీ తమ ఇంట్లో కోడిపుంజుల పట్ల ప్రేమను ఘనంగా చాటారు. వాటికి బర్త్ డే పార్టీ చేశారు. వీరూ, షేరూ పేర్లున్న ఆ పుంజులకు ఐదో పుట్టిన రోజును చేశారు. వాటితో కేక్ కట్ చేయించారు. బ్యానర్లు, లైటింగ్ తో వేడుగా కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడు పుంజుల బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదృష్టమంటే ఈ కోడి పుంజులదేనని కామెంట్లు చేస్తున్నారు. లంగర్కండే కుటుంబం ఈ కోడి పుంజుల పుట్టిన రోజు వేడుకలను జరిపింది. 10మంది కుటుంబ సభ్యులు వీరూ, షేరూ బర్త్ డేను జరిపారు. ఐదేళ్ల క్రితం ఈ కోడి పంజులను మార్కెట్ నుంచి తెచ్చుకొని, అప్పటి నుంచి అపురూపంగా చూసుకుంటున్నట్టు మేఘన్ చెప్పారు.
“మేము ఏడు కోడి పిల్లలను తీసుకొచ్చాం. దురదృష్టవశాత్తు, అందులో ఆరు నెలల లోపు ఐదు మృతి చెందాయి. ఈ రెండు ఎంతో ఆరోగ్యవంతంగా పెరిగాయి. అందుకే వీటికి వీరూ, షేరూ అని పేరు పెట్టాం. మే కుటుంబం వ్యాపారం చేస్తోంది. అప్పట్లో చాలా డల్‌గా నడిచేది. ఈ కోళ్లు వచ్చాక మా వ్యాపారం దశ తిరిగింది. ఈ కోళ్లు మా కుటుంబంలో భాగం. మేం చేసుకున్న అన్ని వేడుకల్లో ఇవీ పాల్గొంటాయి” అని మేఘన్ అన్నారు.
పొద్దున్నే ఈ కోడిపుంజులకు బిస్కర్లు, ధాన్యం తినిపిస్తారు ఈ కుటుంబ సభ్యులు. “అవి కూడా మా కుటుంబ సభ్యులే. అందుకే కేక్ కట్ చేయించాలని నిర్ణయించాం. విద్యుత్ దీపాలతో అలంకరించాం. వీరూ, షేరూ మా ఇంట్లో పిల్లలే. మా కంటే ముంద నిద్రలేస్తాయి. మేం వ్యాపారానికి వెళ్లాలని గుర్తు చేస్తాయి” అని తెలిపారు.