KARIMNAGAR MUNICIPAL CORPORATION TAKES KEY DECISION ON FUNERAL CHARGE ONLY 1 RUPEE FOR CREMATING BODIES BS
అక్కడ రూపాయికే అంత్యక్రియలు.. ఉచితంగా ఫ్రీజర్, కట్టెలు, కిరోసిన్..
ప్రతీకాత్మక చిత్రం (Getty Images)
చనిపోయిన వారి సమాచారాన్ని కరీంనగర్న గర పాలక సంస్థకు చేరవేసి రూపాయి చెల్లిస్తే ప్రత్యేక సిబ్బంది ఇంటికి వెళ్లి అంతిమ సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంతిమయాత్రకు వాహనాన్ని, బాడీ ఫ్రీజర్ను ఉచితంగా ఇస్తారు.
ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు చేయించేందుకు కూడా కొంతమంది నిరుపేదల వద్ద డబ్బులు ఉండవు. జీవించి ఉన్నంత కాలం ఏం సంపాదించారో, ఏం పోగొట్టుకున్నామనేది పక్కనబెడితే.. చనిపోయాకైనా వారికి ఘనంగా వీడ్కోలు పలకాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం కరీంనగర్ నగరపాలక సంస్థ వినూత్న పథకానికి తెర తీసింది. అంత్యక్రియల విషయంలో నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క రూపాయి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. అంతిమయాత్ర, అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం ప్రకటించారు. జూన్ 15 నుంచి ‘అంతిమ యాత్ర-ఆఖరి సఫర్’ పేరిట ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. అన్నివర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చనిపోయిన వారి సమాచారాన్ని బల్దియాకు చేరవేసి రూపాయి చెల్లిస్తే ప్రత్యేక సిబ్బంది ఇంటికి వెళ్లి అంతిమ సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంతిమయాత్రకు వాహనాన్ని, బాడీ ఫ్రీజర్ను ఉచితంగా ఇస్తారు. దహన సంస్కారాలు చేసేవారికి ఉచితంగా కట్టెలు, కిరోసిన్ ఇస్తారు. ఖననం చేసే వారికైతే గుంతను తవ్విస్తారు. అంత్యక్రియల రోజున 50 మందికి రూ.5కే భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం నిర్వహణ కోసం బల్దియా రూ.1.50కోట్లు మంజూరు చేయడంతో పాటు విరాళాలు సేకరిస్తోంది. వీటితోపాటు కర్మకాండలకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సిన వాటిపై చర్చిస్తున్నామని రవీందర్ తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.