KANYADANAM MOVIE STORY BECAME REAL IN KANPUR HERE IS THE DETAILS SSR
Strange: పెళ్లాడిన భార్య నోటి వెంట ఆమె ప్రియుడి పేరు విన్న భర్త.. ఏం చేశాడో ఊహించలేరు..
కోమల్
దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ తెరకెక్కించిన కన్యాదానం సినిమా గుర్తుండే ఉంటుంది. భార్య వేరొకరిని ప్రేమించిందని తెలుసుకున్న భర్త తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు.
దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ తెరకెక్కించిన కన్యాదానం సినిమా గుర్తుండే ఉంటుంది. భార్య వేరొకరిని ప్రేమించిందని తెలుసుకున్న భర్త తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. అప్పట్లో ఈ సినిమా జనాదరణ పొందింది. కానీ.. నిజ జీవితంలో ఇలాంటి భర్తలు ఉండటం చాలా అరుదు. భార్య నోటి వెంట ఆమె ప్రేమించిన వాడి పేరు వచ్చినా ఏ భర్త కూడా తట్టుకోలేడు. అలాంటిది భార్య తనకు ఇష్టం లేదని చెప్పగానే తొలుత షాకయిన భర్త ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి.. ఆమె కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన పంకజ్ అనే యువకుడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం పంకజ్‌కు కోమల్ అనే యువతితో వివాహమైంది. అత్తారింట్లో అడుగు పెట్టిన వెంటనే కోమల్ ఆమె భర్తకు షాకిచ్చింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, బలవంతంగా పెళ్లికి ఒప్పించారని.. తనకు పింటూ అంటే ఇష్టమని చెప్పింది. కోమల్ నోటి వెంట ఆమె ప్రియుడి పేరు విన్న భర్తకు ఏం అర్థం కాలేదు. అప్పటిదాకా భార్యతో తాను ఊహించుకున్న కలలు చెదిరిపోయాయి. ఈ పరిణామం పంకజ్‌ను షాక్‌కు గురిచేసింది. ఈ విషయంలో తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని భార్యకు చెప్పాడు.
ఇక.. కోమల్ ప్రేమ విషయానికొస్తే పింటూ, కోమల్ కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే.. కోమల్ కుటుంబం పింటూను అల్లుడిగా చేసుకునేందుకు నిరాకరించింది. కూతురి ఇష్టాన్ని కాదని పెళ్లి చేశారు. కోమల్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పింటూ ఆమెను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతనికి ఒకరోజు కోమల్ భర్త పంకజ్ నుంచి కాల్ వచ్చింది. కోమల్ తనకు అంతా చెప్పిందని.. ఆమెకు చట్ట ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులిచ్చి.. ఇద్దరి పెళ్లి తాను చేస్తానని పింటూకు పంకజ్ మాటిచ్చాడు. పింటూకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్టయింది. కోమల్ కూడా ఈ పరిణామంతో ఎంతో సంతోషించింది. తన పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు పంకజ్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఆమె తల్లిదండ్రులను కూడా పంకజ్ ఎట్టకేలకు ఒప్పించాడు.
కోమల్ తల్లిదండ్రులు, ఊరి పెద్దల సమక్షంలో ఆమె కోరుకున్న వ్యక్తితో పంకజ్ పెళ్లి జరిపించాడు. ఈ పెళ్లితో కోమల్ హ్యాపీ. ఆమె ప్రియుడు పింటూ డబుల్ హ్యాపీ. పంకజ్ కూడా సంతోషంగా పెళ్లి జరిపించినప్పటికీ ఎంతో కొంత బాధను దిగమింగుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితి. పంకజ్ ఈ పెళ్లి గురించి మాట్లాడుతూ.. బలవంతంగా ఎవరినీ కుటుంబంలో ఒకరిగా చేసుకోలేమని.. ఇద్దరి అంగీకారంతోనే భార్యాభర్తలుగా ముందుకు సాగగలమని చెప్పాడు. పంకజ్ ఈ పెళ్లి జరిపించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కాన్పూర్‌లో ఈ పెళ్లి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎదుటి వారి పరిస్థితిని అర్థం చేసుకుని వారి ఇష్టాయిష్టాలకు విలువనిచ్చే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారని, పంకజ్ లాంటి అర్థం చేసుకునే మనస్తత్వం అందరికీ ఉండదని అతని మిత్రులు, సన్నిహితులు చెప్పారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.