అంతుచిక్కని రహస్యాలెన్నిటినో తనలో దాచుకున్న ఖగోళంలో అప్పుడప్పుడూ మనవూలకూ కనిపించే అద్భుతాలు చోటుచేసుకుంటాయి. సామాన్యుల నుంచి శాస్త్రవేత్తలదాకా అరుదైన ఖగోళ ఘట్టాలను ఆసక్తికరంగా వీక్షిస్తారు. అలాంటి ఓ అద్భుతం ఈ నెలలోనే ఆవిష్కృతం కానుంది. ఉత్తరార్థ గోళం నుంచి నేరుగా కళ్లతోనే చూడగల దృశ్యం ఈనెల 20న చోటుచేసుకోనుంది..
సౌరకుటుంబంలోని నాలుగు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. గురు(బృహస్పతి), శుక్ర, శని, అంగారక గ్రహాలను ఉత్తరార్ధగోళం నుంచి చూడవచ్చు. ఏప్రిల్ 17 నుంచి ఈ నాలుగు గ్రహాలు దాదాపు ఒకే రేఖపైకి వచ్చినట్టు కనిపిస్తాయి. అయితే ఏప్రిల్ 20న ఉదయం సూర్యోదయానికి ముందు మరింత స్పష్టంగా కనుల విందు చేస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహాలను చూసేందుకు అనువైన పరిస్థితులు ఉండాలంటున్నారు.
శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరి నుంచే మొదలైంది. ఏప్రిల్ తర్వాత బృహస్పతి కూడా ఈ రేఖపైకి వస్తుంది. ఖగోళ అద్భుతాలు అరుదుగా సంభవిస్తుంటాయి. మరీ ముఖ్యంగా 4 గ్రహాలు ఒకే రేఖపైకి రావడం చాలా చాలా అరుదని సైంటిస్టులు పేర్కొంటున్నారు. మరోవైపు ఏప్రిల్ 23న ఈ నాలుగు గ్రహాల సరసన చంద్రుడు కూడా చేరబోతున్నాడు. సరళ రేఖ కుడిపక్కన చందమామ కనిపిస్తుంది. అయితే అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ప్రత్యేకంగా కనిపిస్తాయి.
కాగా, ఈ ఏడాది జూన్ 24న ఇదే తరహాలో మరో అద్భుతం దర్శనమివ్వబోతోంది. సౌరవ్యవస్థలోని బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్ ఒకే రేఖపైకి వచ్చి వీక్షకులను ఆకట్టుకోనున్నాయని చికాగోలోని అడ్లెర్ ప్లానెటేరియానికి చెందిన ఆస్ట్రానమీ ఎడ్యుకేటర్ మిచెల్లీ నికోలస్ చెప్పారు.
అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడడానికి బైనాక్యులర్ లేదా టెలీస్కోప్ అవసరమవుతుందని సూచించారు. ఈ దృశ్యాన్ని ఫొటోలు తీయడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఆకాశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా చాలా అరుదుగా ఉంది. 2005 నుంచి ఇప్పటికి కేవలం మూడు సార్లు మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరిగాయి. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రాబోవని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Space, Wonderful parents