అక్కడ జేసీబీలు, కాంక్రీట్ మిక్సర్‌లు నిరంతరం పనిచేస్తాయి. పెద్ద పెద్ద ట్రాక్టర్ ట్రాలీలు అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తాయి. జనాలు ఎవరి పనుల్లో బిజీగా ఉంటారు. వాటిని దూరం నుంచి చూస్తే... అక్కడ ఏదో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. అందుకే జేసీబీలు, కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాలు, ట్రాలీలు పనిచేస్తున్నాయని భావిస్తారు. కానీ నిజానికి అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు జరగడం లేదు. ఓ ఆలయంలో ప్రసాదాల తయారీకి వీటిని వినియోగిస్తున్నారు. మరి ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకంత ఫేమస్? పెద్ద యంత్రాలతో ప్రసాదాలు ఎందుకు తయారు చేస్తున్నారు? ఆ వివరాలను తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని భిండ్ జిల్లాలో దంద్రౌవా ధామ్ (Dandraua Dham) అనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. అది హనుమంతుడి ఆలయం (Hanuman Temple). ఇక్కడ ఏటా సియా పియా మిలన్ పేరుతో 11 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ప్రముఖ ప్రవచనకర్త ధీరేంద్ర కుమార్ శాస్త్రి అక్కడ పురాణ కథలు, ప్రవచనాలు చెబుతుంటారు. ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ధీరేంద్ర ప్రవచనాలు వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తువస్తుంటారు. వందలు, వేలు కాదు.. దేశం నలుమూలల నుంచి లక్షల్లో వస్తుంటారు. ఆలయం చుట్టుపక్కల తాత్కాలిక వసతులను ఏర్పాటు చేసుకొని.. రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. వారికి ఆలయ నిర్వాహకులే భోజనం, ప్రసాదాలను పంపిణీ చేస్తుంటారు. లక్షల మందికి భోజన ప్రసాదాలు చేయాలంటే చిన్న విషయం కాదు. అందుకోసం పెద్ద పెద్ద యంత్రాలను వినియోగిస్తారు.
ఓ గ్రౌండ్‌లో కిచెన్ ఏర్పాటు చేసి.. అక్కడే వివిధ రకాలను వండుతారు. ప్రతి రోజూ 30 ట్రాలీల భోజనంతో పాటు ప్రసాదం కోసం 40 ట్రాలీలు మల్ పువా, 20 ట్రాలీల ఖీర్ సిద్ధం చేస్తారు. ఇందుకోసం రోజూ 300 క్వింటాళ్ల బంగాళదుంపలు, 1.5 టన్నుల పాలు, ఒక టన్ను బియ్యం, 75 క్వింటాళ్ల చక్కెర, 15 టన్నుల మైదాను వినియోగిస్తున్నారు. పిండి కలిపేందుకు కాంక్రీట్ మిక్సర్ యంత్రాలను, వంటకాలను పాత్రల్లో వేసేందుకు జేసీబీలను, వాటిని తరలించేందుకు ట్రాలీలను ఉపయోగిస్తారు. ఇక్కడ ఉపయోగించే ఒక పాత్ర.. రాష్ట్రంలోనే అతి పెద్దది కావడం విశేషం.
కాగా, ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ప్రవచన కార్యక్రమాలు నవంబరు 15 నుంచి ఇక్కడ జరుగుతున్నాయి. ఆయన ప్రవచనాలను వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆలయం వెలుపల కూర్చేందుకు స్థలం కూడా దొరకడం లేదు. దాదాపు 4 లక్షల మంది వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శైలేంద్ర సింగ్ స్వయంగా సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, OMG