పనామా పేపర్స్ లీక్ కేసులో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాలకు సంబంధించి స్టార్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ను కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం గంటల తరబడి ప్రశ్నించింది. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఐశ్వర్య విచారణ ఎదుర్కొన్న సమయంలోనే.. పార్లమెంట్ వేదికగా ఆమె అత్తగారైన జయా బచ్చన్ సంచలన చర్యకు పాల్పడ్డారు. డ్రగ్స్ ఉదంతంపై చర్చ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షానికి చెందిన కొందరు ఎంపీలు ఐశ్వర్య రాయ్ విచారణను ప్రస్తావించడంతో ఆమె సహనం కోల్పోయారు. మోదీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయంటూ ఆవేశంగా శాపనార్థాలు పెట్టారు. అత్తాకోడళ్లకు సంబంధించి ఇవాళ చోటుచేసుకున్న వరుస ఘటనలు సంచలనంగా మారాయి..
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభలో సహనం కోల్పోయి సర్కారుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మీకు(అధికార పక్షానికి) రోజులు దగ్గరపడ్డాయని, ఇదే నా శాపమని ఆమె తిట్టిపోశారు. తన కుటుంబీకులపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకుగానూ బీజేపీ ఎంపీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో మాదక ద్రవ్యాల బిల్లుపై చర్చ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడిన సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది.
జయా బచ్చన్ మాదక ద్రవ్యాల బిల్లుపై మాట్లాడుతూ.. 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘మాకు న్యాయం కావాలి. కానీ మీ(సభ) నుంచి దాన్ని ఆశించగలమా? సభలో కూర్చున్న విపక్ష సభ్యులను, బటున్న(సస్పెండైన) సభ్యులను మీరు(సభాపతి) ఎలా కాపాడుతున్నారు?’అంటూ చైర్మన్ స్థానంలో కూర్చున్న భువనేశ్వర్ కలితను ఉద్దేశించి కామెంట్లతో జయ ప్రసంగం ప్రారంభించారు. అయితే, సభాపతిని నిందించేలా జయ వ్యాఖ్యలు ఉన్నాయంటూ బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. ఆ వెంటనే అధికార బీజేపీ పక్షానికి చెందిన పలువురు ఎంపీలు వెటకారపు కామెంట్లు చేశారు..
జయ బచ్చన్ న్యాయం కావాలని అడుగుతున్నది సహచర ఎంపీల కోసం కాదని, ఈడీ వలలలో చిక్కుకున్న కోడలు ఐశ్వర్య రాయ్ కోసమేనని కొందరు ఎంపీలు కామెంట్లు చేశారు. అంతే, ఆ మాటు విన్న జయ ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ‘ఏంటి? ఏం జరుగుతోంది సభలో? ఇది భయానకం! సభలో లేని వాళ్లను గురించి వ్యక్తిగత కామెంట్లు చేస్తారా? మీకిదే నా శాపం.. తొందర్లోనే మీకు(అధికార పక్షానికి) చెడ్డ రోజులు మొదలవుతాయి..’అంటూ జయ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని జయాబచ్చన్ డిమాండ్ చేయగా.. ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తామని చైర్మన్ ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.