Mouse sperm : ఎలుకల వీర్యం ఇంత బలమైందా!..అంతరిక్షంలో ఆరేళ్లు ఉంచిన తర్వాత ఏం జరిగిందంటే..

Photo Credit : AFP

Mouse Sperm : అంతరిక్షంలో అధిక రేడియషన్ వద్ద వీర్యం మనుగడ ఉంటుందా అని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. డీఎన్​ఏను కాస్మిస్​ రేడియేషన్​ వద్ద ఉంచితే ఏం జరుగుతుందనే స్పష్టత కోసం దీన్ని చేపట్టారు. ఒకవేళ భూభాగంపై రేడియేషన్ పెరిగితే వీర్యాల పరిస్థితి ఏంటన్నది దీని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు.

  • Share this:
ఎలుకలపై జపాన్ శాస్త్రవేత్తలు వినూత్న పరిశోధన చేశారు. వాటి వీర్యానికి పెద్ద పరీక్ష పెట్టారు. అయితే వచ్చిన ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు. అంతరిక్ష రేడియషన్ వాతావరణంలో ఎలుకల వీర్యాన్ని ఆరేళ్ల పాటు పరిశోధకులు ఉంచారు. ​ఇన్నేళ్లు దాచి ఉంచిన తర్వాత కూడా ఆ వీర్యం నిర్వీర్యం కాలేదు. దీంతోపాటు అది ఇచ్చిన సత్ఫలితాలను చూసి ముక్కున వేలేసుకున్నారు శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రేడియషన్​లో అన్ని సంవత్సరాలు ఉన్న ఎలుకల వీర్యం ద్వారా ఆరోగ్యకరమైన వందల ఎలుక పిల్లలు పుట్టాయి. వాటికి ఎలాంటి జన్యుపరమైన సమస్యలు రాలేదు. సైన్సెస్ అడ్వాన్స్​లో ఈ పరిశోధన పత్రం ప్రచురితమైంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను బయోలజిస్ట్​, ప్రధాన రచయిత తెరుహికో వకాయామ వెల్లడించారు. ఎలుక వీర్యం అంతరిక్ష వాతావరణంలో ఫలదీకరణం చెందేందుకు, భూమిపై చెందేందుకు చాలా స్వల్ప తేడానే ఉన్నట్టు తెలిపారు. ఆ వీర్యం ద్వారా పుట్టిన ఎలుక పిల్లలు సాధారణంగా ఉన్నాయని, వాటిలో ఎలాంటి అసాధారణ స్థితిని గుర్తించలేదని వివరించారు. జవాన్​లోని యమనాషి యూనివర్సిటీలో వకాయామతో పాటు ఆయన సహచరులు కొందరు 2013లో ఈ పరిశోధన చేపట్టారు. మూడు బాక్సులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్​ఎస్​) పంపారు. ఒక్కో బాక్స్​లో 48 ఇంజక్షన్ సీసాల్లో ఎలుకల పొడి వీర్యాన్ని దాచిపెట్టి సుదీర్ఘ పర్యటన కోసం ఐఎస్​ఎస్​కు పంపించారు.

అంతరిక్షంలో అధిక రేడియషన్ వద్ద వీర్యం మనుగడ ఉంటుందా అని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. డీఎన్​ఏను కాస్మిస్​ రేడియేషన్​ వద్ద ఉంచితే ఏం జరుగుతుందనే స్పష్టత కోసం దీన్ని చేపట్టారు. ఒకవేళ భూభాగంపై రేడిషన్ పెరిగితే వీర్యాల పరిస్థితి ఏంటన్నది దీని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అయితే ఎలుక వీర్యాలన్నింటినీ శాస్త్రవేత్తలు భూమి మీదకు దశల వారీగా తీసుకొచ్చారు. తొమ్మిది నెలల తర్వాత కొన్ని, రెండేళ్ల తర్వాత మరికొన్ని.. చివరగా ఆరేళ్ల తర్వాత మిగిలినవి భూమి మీదకు తీసుకొచ్చి ఫలదీకరణ చేశారు. వీటి ద్వారా వందల ఎలుకలు జన్మించాయి. అయితే ఈ పరిశోధనకు పొడి వీర్యాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే.. ఫ్రిజ్ అవసరం లేకుండా గది ఉష్ణోగ్రతలోనూ మనుగడ సాగించేందుకేనని చెబుతున్నారు. ఇక వీర్యాలను స్టోర్ చేసిన సీసాలు కూడా పెన్సిల్​ అంత చిన్నగా ఉన్నాయి.

“భవిష్యత్తులో మనం వేరే గ్రహానికి వలస వెళ్లాల్సి వచ్చినప్పుడు.. అక్కడి వైవిధ్యమైన పరిస్థితులకు అలవాటు పడాలి. మనుషులే కాదు జంతువులు కూడా అందుకు సిద్ధంగా ఉండాలి. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా జంతువులను కాకుండా స్పేస్​ స్టేషన్​లోకి వాటి వీర్యాలను పంపాం” అని వకాయామ వెల్లడించారు. అలాగే భూమికి ఏదైన ప్రమాదం సంభవిస్తుందేమోనని మనుషులు సైతం వేరే గ్రహాల్లో ఉండాలని కోరుకుంటున్నారని, అందుకే ఆ దిశగా పరిశోధనలు చేసే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్షంలో మనుషుల ఫలదీకరణపై కూడా రీసెర్చ్ చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు అధ్యయనంలో పేర్కొన్నారు.
Published by:Sridhar Reddy
First published: