నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం మైపాడు బీచ్లో జలకన్య కలకలం అని సోషల్ మీడియలో జోరుగా సాగుతోన్న ప్రచారం వట్టిదేనని తేలింది. కొందరు ఆకతాయిలు జలకన్య వీడియోను తీసి వైరల్ చేశారని తేలింది. ఇది కర్ణాటక లేదా శ్రీలంకకు చెందిన వీడియోగా తెలుస్తోంది. ఏపీలో దీన్ని వ్యాప్తి చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్వా చైర్మన్ పామంజి నరసింహులు కోరుతున్నారు.
సాగర తీరంలో అలల హోరును మించిన ఏడుపు శబ్దాలు.. అది మనిషి ఏడ్చినట్లుగా లేదు.. బహుశా అమావాస్య కావడంతో బీచ్ దాదాపు చీకటిగా ఉండింది.. సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో కొందరు యువకులు.. ఆ శబ్దాలు వస్తున్నవైపు కదిలారు.. లైట్ అలా పడిందో లేదో.. అందరూ షాక్.. భారీ చేపల వలలో చిక్కిన జలకన్య కనిపించిందక్కడ. వలను తెంచుకుంటూ బయటికొచ్చే ప్రయత్నంలో ఒకటే అరుపులు.. నడుం కిందివరకు చేపలా, ముఖం మాత్రం వికృతంగా ఉన్న సదరు జలకన్య ఫొటోలు, వీడియోలు గడిచిన వారం రోజులుగా వైరలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాత మైపాడు బీచ్ లో జలకన్య కనిపించిందంటూ జోరుగా సాగుతోన్న ప్రచారమిది..
మొబైల్ ఫోన్ల వ్యాప్తి లేని కాలంలో విరివిగా అమ్ముడుపోయిన ‘వండర్ వరల్డ్’ వీక్లీలో ఇలాంటి వార్తలు తరచూ వచ్చేవి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సృష్టించిన ‘సాహస వీరుడు-సాగరకన్య’ సినిమా, హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ నాలుగో భాగం(ఆన్ స్ట్రేంజర్ టైడ్స్) చూసినోళ్లకు కల్పిత జలకన్యల విన్యాసాలు, వారి జీవన విధానం తెలియనిది కాదు. ప్రకృతి రహస్యాలను మనకింకా పూర్తిగా తెలియని క్రమంలో జలకన్యలు కచ్చితంగా ఉంటారని కొందరు, ఇదంతా ట్రాష్ అని మరికొందరు నమ్ముతుంటారు. విశ్వాసాల సంగతి పక్కనపెడితే, జలకన్యలో, మరే ఇతర కల్పిత కథనాలతో జనాన్ని వెర్రెత్తించే ప్రయత్నాలు మాత్రం చట్టపరంగా నేరం కిందికే వస్తుంది. అవును. నెల్లూరు జిల్లా మైపాడులో చోటుచేసుకున్నది ఇలాంటి ఉదంతమే మరి.
ప్రఖ్యాత పర్యాటక కేంద్రం మైపాడు బీచ్లో జలకన్య కలకలం అని వస్తున్న వార్తలో నిజం లేదని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఏపీ ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు స్పష్టం చేశారు. మైపాడు బీచ్లో ఓ జలకన్య మత్స్యకారులకు చిక్కినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరలైన నేపథ్యంలో సదరు ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారాయన. మైపాడు బీచ్ లో జలకన్య అంటూ వైరలైన వీడియోలో యువకులు మాట్లాడింది తెలుగు భాష కాకున్నా, ఇది నెల్లూరు జిల్లాలోనే జరిగిందని జనాన్ని నమ్మించేందుకు కొందరు ప్రయత్నించిన తీరును నరసింహులు ఖండించారు. అసలు..
https://youtu.be/yH5TucXMUN4
మైపాడు బీచ్ లో జలకన్య వీడియో ముమ్మాటికీ ఏపీలో తీసింది కాదని దాన్ని చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కొందరు ఆకతాయిలు ఈ వీడియోని సృష్టించి.. పది రోజుల కిందట కర్ణాటకలో జరిగిన సంఘటనగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని, ఇది శ్రీలంకకు చెందిన తుంటరి పోరగాళ్లు చేసిన సిల్లీ వీడియో అని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. మైపాడు బీచ్లో జలకన్య చిక్కినట్లు సోషల్ మీడియాలో పోస్టులు సృష్టించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆక్వా డైరెక్టర్ నరసింహులు పోలీసులను కోరారు. ఫేక్ ప్రచారాలు ఎలా ఉంటాయో, వాటి పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేయడానకే ఈవార్తను ప్రచురించాం.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.