అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమా? నిజం తెలిస్తే షాక్ అవడం ఖాయం..

Bike Lift or Car Lift: సెక్షన్ 66/192 రూల్ ప్రకారం సొంత వాహనాన్ని వాణిజ్య వాహనంగా ఉపయోగించకూడదు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 28, 2019, 9:42 PM IST
అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమా? నిజం తెలిస్తే షాక్ అవడం ఖాయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ ప్రదేశంలో ఫుల్లుగా వర్షం పడుతోంది.. ఇద్దరు వ్యక్తులు వర్షానికి తడుస్తూ గజ గజ వణుకుతున్నారు. వేరే చోటుకు వెళ్లేందుకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమోనని వేచి చూస్తున్నారు. అటుగా మీరు కారులో గానీ, బైక్‌లో గానీ వెళ్తున్నారనుకోండి.. ఏం చేస్తారు? పాపం అని మానవతా దృక్పథంతో లిఫ్ట్ ఇస్తారు. మీరు వెళ్లే దిశగానే వెళ్తే వారిని అక్కడి వరకు తీసుకెళ్తారు. అయితే, మీరు లిఫ్ట్ ఇచ్చిన విషయం పోలీసులకు తెలిసిందో? మీకు జరిమానా పడటం ఖాయం. ముంబైలో ఓ వ్యక్తికి ఇలాగే రూ.1500 జరిమానా పడింది. అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్సును కూడా పోలీసులు స్వాధీనం చేసేసుకున్నారు. మరోసారి ఇలా చేస్తే కఠిన శిక్ష పడుతుంది అని కూడా హెచ్చరించారు. ఇదేంటి వింత అనుకుంటున్నారా? అయితే.. పూర్తిగా చదవండి.

అతడి పేరు నితిన్ నాయర్. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమాని. ముంబై నివాసి. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్‌కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న నితిన్.. కారును ఆపి, ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు ఆ పోలీస్.
విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్‌ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడా పోలీస్. నితిన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. దేనికి ఛలానా అని ప్రశ్నించాడు. ‘మీది సొంత వాహనం. వాణిజ్య వాహనం కాదు. అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం నేరం.’ అని బదులిచ్చాడా పోలీస్.

నితిన్ నాయర్‌కు పోలీసులు విధించిన జరిమానా రసీదు (facebook image)
వెంటనే కోపంతో రగిలిపోయిన నితిన్.. పోలీస్‌పై తన అక్కసు వెళ్లగక్కాడు. వెంటనే ఆ పోలీస్.. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం సొంత వాహనాన్ని వాణిజ్య వాహనంగా ఉపయోగించకూడదు. అని చెప్పి, రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ స్పష్టం చేశాడు ఆ పోలీస్.

ఏం చేయాలో పాలు పోక కిమ్మనకుండా ఉండిపోయిన నితిన్.. కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఇందన్న సంగతి తెలియదని వాపోయాడు.

తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. మీరు లిఫ్ట్ అడిగితే ఇస్తున్నారా? అయితే, ఆ వాహనం ప్రైవేటు వాహనమా? లేక వాణిజ్య వాహనమా? అని ముందే గుర్తించి లిఫ్ట్ ఇస్తే మంచిది.
First published: June 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు