IRAN GOVERNMENT BANS PET CATS BILL TO BE INTRODUCED SOON HERE IS THE REASON AK GH
Cats Ban: ఆ దేశంలో పెంపుడు పిల్లులపై నిషేధం.. అదే కారణం.. జంతు ప్రేమికులు ఆగ్రహం
ప్రతీకాత్మక చిత్రం
Cats Ban: ఇరాన్లో పెంపుడు జంతువుగా పిల్లిని పెంచితే శిక్షార్హులు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం చాలా పిల్లి జాతులను నిషేధించే ఓ వివాదాస్పద చట్టాన్ని తాజాగా తీసుకువచ్చింది. దీనితో ఇరానియన్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్యూట్‌గా కనిపించే క్యాట్స్‌ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. వీటిని పెంచడం కూడా అంత కష్టమైన పనేం కాదు. మానవులు వేల సంవత్సరాల నుంచి వీటిని ఇష్టంగా పెంచుకుంటున్నారు. మన భారతదేశంలో కూడా ఏ మూలకు వెళ్లినా ఎవరో ఒకరి ఇంట్లో పెంపుడు పిల్లులు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇరాన్లో మాత్రం ఇకపై పెంపుడు పిల్లులు కనిపించకూడదట. ఒకవేళ ఇరాన్లో పెంపుడు జంతువుగా పిల్లిని పెంచితే శిక్షార్హులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం చాలా పిల్లి జాతులను నిషేధించే ఓ వివాదాస్పద చట్టాన్ని తాజాగా తీసుకువచ్చింది. దీనితో ఇరానియన్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. దీని గురించి తెలిసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టం ఏంటి? దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? జంతు ప్రేమికుల స్పందన ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.
ఇటీవల ఇరాన్లో దాదాపు 75 మంది శాసనసభ్యులు 'ప్రొటెక్షన్ ఆఫ్ ది పబ్లిక్ రైట్స్ ఎగైనెస్ట్ యానిమల్స్' పేరుతో ఒక చట్టాన్ని ప్రతిపాదించారు. నవంబర్‌లో ఈ ప్రతిపాదిత చట్టాన్ని ప్రవేశపెట్టారు. అపరిశుభ్రమైన జంతువుల నుంచి దేశాన్ని రక్షించడానికే ఈ బిల్లును ప్రవేశపెట్టామని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రతిపాదిత చట్టం పిల్లులకు మాత్రమే పరిమితం కాదు. ఇది అటవీ, విదేశీ, హానికరమైన, ప్రమాదకరమైన జంతువులను దిగుమతి చేయడం, పెంచడం, సంతానోత్పత్తిలో సహాయం చేయడం, కొనుగోలు చేయడం లేదా విక్రయించడం, రవాణా చేయడం, ఇంట్లో ఉంచడం వంటివి నిషేధించాలని చెబుతోంది.
అయితే ఈ హానికరమైన, ప్రమాదకరమైన జంతువుల్లో పిల్లులు, పాములు, తాబేళ్లు, బల్లులు, ఎలుకలు, కుక్కలు, కుందేళ్లు వంటి ఇతర జంతువుల కూడా ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. వీటన్నింటిని ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబాలు పెంపుడు జంతువులుగా పెంచుతాయి. అయితే ఇప్పుడు వీటిని బ్యాన్ చేస్తూ చట్టాన్ని అమలు చేస్తామని ఇరాన్ చట్టం చెబుతుండటం అక్కడి జంతు ప్రేమికులకు మింగుడు పడటం లేదు.
ఈ ప్రతిపాదిత చట్టం ఇరాన్లో జంతువులను పెంచే వ్యక్తులను విధ్వంసక సామాజిక సమస్యగా అభివర్ణిస్తోంది. ఇది ఆమోదం పొందితే కుందేళ్లు, కుక్కలు, పిల్లుల వంటి జంతువులను సొంతం చేసుకోవడం, సంతానోత్పత్తి చేయడం, రవాణా చేయడం నిషేధం గా మారుతుంది. పార్లమెంటేరియన్లలో నాలుగింట ఒక వంతు మంది ప్రతిపాదిత చట్టం కోసం టెక్స్ట్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది.
ఈ చట్టానికి ఇంకా ఆమోదముద్ర పడలేదు కానీ ఇప్పుడు ఇరాన్‌లోని జంతు ప్రేమికులు మాత్రం దీనిని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దేశంలో అనేక మంది వీధికుక్కల దాడికి గురైన సందర్భాల కారణంగా ఈ ప్రతిపాదిత చట్టం వచ్చిందని నివేదికలు పేర్కొంటున్నాయి. బిల్లు చట్టరూపం దాలిస్తే, దీన్ని ఉల్లంఘించిన వారు తమ కనీస నెలవారీ పని వేతనానికి 10-30 రెట్లు సమానమైన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వారి జంతువులను అధికారులు స్వాధీనం చేసుకుంటారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.