ఎంత పెద్ద డాక్టరైనా తనకు ఇబ్బంది వస్తే మరో డాక్టర్‌ను సంప్రదిస్తారు.. సొంతింటి వైద్యం పనికిరాదన్నట్లు డాక్టర్లు తమ కుటుంబీకులను కూడా వేరే డాక్టర్లకే రిఫర్ చేస్తుండటం చూస్తుంటా.. అలాంటిది కొందరు సెల్ఫ్ క్లెయిమ్డ్ మేతావులు మాత్రం అంతా తమకే తెలుసని, యూట్యూబ్ యూనివర్సిటీ ఉండగా ఏదైనా చేసేయొచ్చనుకుంటారు. భావన వరకైతే పర్వాలేదుగానీ, అవతలివాళ్ల ప్రాణాల మీదికి తెస్తేనే సమస్యంతా. ఇదిగో ఈ లోకనాథంలాగా. యూట్యూబ్ వీడియోలు చూస్తూ, ఇంట్లోనే భార్యకు ప్రసవం చేసిన ఈ ప్రబుద్దుడు పసిబిడ్డ ప్రాణాలు పోవడానికి, తల్లి ప్రాణాపాయంలో పడటానికి కారకుడయ్యాడు. తమిళనాడులోని రానిపేట్ జిల్లా వైద్య అధికారులు, పోలీసులు చెప్పిన వివరాలివి..
తమిళనాడులోని నేమిలి జిల్లా పణపాకం గ్రామానికి చెందిన లోకనాథన్(32) చిరు వ్యాపారి. స్థానికంగా చిల్లర కొట్టు నడుపుతుంటాడు. అతని భార్య గోమతి(28) గర్భిణి. నెలలు నిండిన ఆమెకు లెక్క ప్రకారం ఈనెల 13నే ప్రసవం కావాల్సి ఉంది. కానీ ఐదు రోజులు ఆలస్యంగా ఈనెల 18న పురిటి నొప్పులు వచ్చాయి. భర్తకు ఫోన్ చేయగా షాప్ కట్టేసి ఇంటికొచ్చాడు. లోకనాథన్ తన సోదరి జ్యోతి సహాయంతో ఇంట్లోనే గోమతికి ప్రసవం చేసేందుకు ప్రయత్నించాడు. నిజానికి వీళ్లు ముందే ఇలా చేయాలని నిర్ణియించుకున్నారు.
గోమతి నొప్పులతో బాధపడుతుండగా, లోకనాథన్, అతని సోదరి జ్యోతి యూట్యూబ్ లో మహిళల లేబర్ డెలివరీ వీడియోలు చూస్తూ ఇక్కడ అదే విధంగా వ్యవహరించారు. దాదాపు గంటసేపు ఇబ్బంది పడ్డ గోమతి చివరికి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టే సమయానికే ఆ శిశువు చనిపోయింది. కాన్పు తర్వాత గోమతికి విపరీతంగా రక్తస్రావం అయి స్పృహ కోల్పోయింది. అప్పుడుగానీ లోకనాథన్ తన భార్యను స్థానిక ప్రైమరీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కండిషన్ సీరియస్ గా ఉండటంతో గోమతిని వేలూరు జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో వైద్య, పోలీస్ అధికారులు స్పందించారు.
గోమతి గర్బవతి అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా చెకప్ కోసం హెల్త్ సెంటర్ కు రాలేదని, ఏరియాలో పనిచేసే ఏఎన్ఎం, నర్సులు స్వయంగా గోమతి ఇంటికి వెళ్లినా తనకే సహాయం అక్కర్లేదని ఆమె చెప్పేదని, కొన్నొ నెలలపాటు ఏఎన్ఎంలు ప్రయత్నించినా లోకనాథన్ కూడా తీరు మార్చుకోలేదని రాణిపేట్ జిల్లా వైద్య అధికారి మీడియాకు చెప్పారు. ఈ ఘటనపై వైద్య సిబ్బంది ఫిర్యాదుతో రాణిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ట్విస్ట్ ఏంటంటే..
నవజాత శిశువు మరణానికి, గోమతి ప్రాణాపాయానికి కారకుడైన లోకనాథన్ పై కేసు పెట్టాలని డిమాండ్లు వచ్చినా, పోలీసులు మాత్రం ఆ దిశగా కదల్లేకపోయారు. ఇంట్లోనే ప్రసవం జరగాలన్నది గోమతి ఇష్టపూర్తిగా తీసుకున్న నిర్ణయమని, ఆస్పత్రికి పోదామని బతిమాలినా ఆమె వినిపించుకోలేదని, గోమతి ఇష్టప్రకారమే అంతా జరిగిందని లోకనాథన్, అతని సోదరి జ్యోతి పోలీసులకు చెప్పుకున్నారు. నిజమేంటో చెప్పడానికి ఆమె ఇంకా కోలుకోలేదు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రాందాస్ స్పందించారు. ‘యూట్యూబ్ వీడియోలు చూసేసి నేర్చుకోడానికి ప్రసవమేమీ నూడుల్స్ కాదు, రసం తయారు చయడం అంతకన్నా కాదు’అని చురకవేశారు.
ఇదే తమిళనాడులో గతంలోనూ ఇలాంటివే రెండు ఘటనలు జరిగాయి. 2020 మార్చిలో గుమ్మిడిపూండికి చెందిన సౌందర్ (27) వంట గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు సరఫరా చేస్తూ, ఓ కాలేజీ విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడిపాడు. అమ్మాయి గర్భవతి కావడంతో ఇంట్లోవాళ్లకు తెలియకుండా స్నేహితుల సాయంతో యూట్యూబ్ వీడియోలు చూసి అతనే ప్రసవం చేసి ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. నాటి ఘటనలో సౌదర్ పై కేసు నమోదైంది. అంతకుముందు, 2018 జులైలో తిరుపూర్‌కు చెందిన యువ ఉపాధ్యాయురాలు కృతిక ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నెలలు నిండిన ఆమెకు భర్త కార్తికేయన్, స్నేహితుడు ప్రవీణ్, అతడి భార్య లావణ్య కలిసి ఇంట్లోనే పురుడుపోయగా, తల్లీపిల్లలు మరణించారు. ఈ పరంపరంలో వెలుగులోకి వచ్చిన మూడో ఘటన లోకనాథన్, గోమతి దంపతులది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home delivery, Pregnent women, Tamil nadu