news18-telugu
Updated: July 24, 2020, 1:16 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా వీధి వ్యాపారుల దగ్గరి నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు దాదాపు అంతా దెబ్బతిన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలింపులు ఇచ్చినప్పటికీ వ్యాపారాలు పెద్దగా కోలుకోలేదనే చెప్పాలి. దుకాణాలకు అద్దెలు చెల్లించలేక.. కుటుంబాలను పోషించుకోలేక వారు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఓ వైపు కరోనా కేసులు విపరీతంగా నమోదవుతుండడంతో.. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. అలా వచ్చినవారు సైతం గతంలో లాగా ఏదీ పడితే అది కొనేందుకు ఆస్తకి చూపడం లేదు. దానికి ఆర్థిక ఇబ్బందులు లేకపోలేదు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వ్యాపారులు తమ దుకాణాలు తెరిచేందుకు ‘లెఫ్ట్-రైట్’ విధానాన్ని అవలంభిస్తున్నారు.
అయితే ఇండోర్‌లో తోపుడు బండిపై కోడిగుడ్లను అమ్ముకునే ఓ బాలుడి వద్దకు అధికారులు వచ్చారు. ఇక్కడి నుంచి బండి తొలగించాలని, లేకపోతే రూ.వంద ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. కరోనా వైరస్ కారణంగా అసలే గిరాకీ లేక బతుకు భారంగా గడుస్తోంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో రూ.వంద ఇచ్చేందుకు బాలుడు అంగీకరించలేదు. దీంతో అధికారులు ఆగ్రహించి ఆ బాలుడి కోడిగుడ్లను బండిని బోల్తా పడేశారు. దీంతో కోడిగుడ్లన్నీ పగిలిపోయాయి. అయితే ఈ వ్యవహారన్నంతా స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
అయితే అసలే చేతిలో డబ్బుల్లేక అప్పుచేసి కొన్నిగుడ్లను తెచ్చి విక్రయించుకుంటుంటే.. అధికారులు కోడిగుడ్ల బండిని బోల్తా పడేసి కోడిగుడ్లను నాశనం చేశారని బాలుడు ఆరోపించారు. ఇప్పుడు నేనే మళ్లీ కోడిగుడ్లను ఏలా తెచ్చి అమ్ముకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వ్యాపారాలు నిర్వహించేందుకు అవలంభిస్తున్న లెఫ్ట్- రైట్ విధానాన్ని రద్దు చేయాలని సీనియర్ రాజకీయ నేత భన్వర్ సింగ్ షేఖావత్‌తో సహా అధికార బీజేపీకి చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విధానానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే మహేంద్ర హెర్డియా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ సైతం ఇండోర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ శుక్లా స్పందిస్తూ వీధి వ్యాపారులపై వేధింపులను ఆపకపోతే వీధుల్లో కొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇండోర్‌లో బుధవారం ఒక్కరోజే 118 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు ఇండోర్ జిల్లాలో 6457 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
Published by:
Narsimha Badhini
First published:
July 24, 2020, 11:58 AM IST