ఆకలవుతున్నప్పుడు వేడి వేడి సమోసాను చూస్తే.. ‘దీనిని తినని జన్మెందుకురా..?’ అనిపిస్తుంది. స్పైసీగా.. రుచికరంగా ఉండే సమోసా అంటే ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముసలోల్ల దాకా లొట్టలేసుకుంటూ తింటారు. భారతీయ వంటకాల్లో సమోసాది ఒక ప్రత్యేక స్థానం. ఈవినింగ్ స్నాక్ గా చాలా మంది ప్లేట్ లో సమోసా ఉండాల్సిందే. అంతటి ఘన చరిత్ర ఉన్న మన సమోసా.. గగనానికి కూడా ఎగిరింది. అంతరిక్షంలో చెక్కర్లు కొడుతూ వయ్యారాలు పోయింది. అదేంటి సమోసా అంతరిక్షాన ఎగరడమేంటి అనుకుంటున్నారా..? ఏమో.. గుర్రాలే కాదు.. సమోసాలూ ఎగురావచ్చు. ఆ వీడియోలూ వైరల్ కానూవచ్చు.
యూకే కు చెందిన భారతీయ సంతతి వ్యక్తి నీరజ్ కు లండన్ లోని బాత్ లో ఒక రెస్టారెంట్ ఉంది. చాయ్ వాలా దాని పేరు. చిన్నప్పట్నుంచి ప్రయోగాలంటే ఇష్టపడే నీరజ్.. తన ఫేవరేట్ ఫుడ్ సమోసాను ఏనాటికైనా అంతరిక్షానికి పంపుతానని తన స్నేహితులతో చెప్పేవాడట. అంతేగాక తనకెంతో ఇష్టమైన సమోసాను అంతరిక్షంలోకి పంపి దానికో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నది ఆయన కల. అందుకోసం పలు మార్లు ప్రయత్నించాడు కూడా. కానీ విఫలమయ్యాడు.
విఫలమైన ప్రతిసారి లోపమెక్కడుందో అధ్యయనం చేశాడు నీరజ్. కొద్ది ప్రయత్నాల అనంతరం ఈ ప్రయోగం సక్సెస్ అయింది. సమోసాలను ఒక బాక్స్ లో ఉంచి.. అవి ఎటూ కదలకుండా గట్టిగా కట్టుకట్టి.. బెలూన్ సాయంతో వాటిని పైకి ఎగరేశాడు నీరజ్. ఆ బెలూన్ లలో హీలియాన్ని నింపాడు. ఇంకా దానికి గో ప్రో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చాడు. దాని గమనాన్ని అంచనా వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. అన్నీ సరిచూసుకుని.. ఇటీవలే సమోసాను అంతరిక్షానికి పంపాడు.
గాలిలోకి వెళ్లగానే బెలూన్ స్పీడందుకుంది. ఇంకేం.. మన సమోసా వయ్యారాలు పోతూ గాలిలో తేలియాడింది. కొద్దిదూరందాకా వాయువేగంతో దూసుకెళ్లిన సమోసా... ఉన్నట్టుండి క్రాష్ అయి కింద పడిపోయింది. సాంకేతిక కారణాల వల్ల అది క్రాష్ అయినట్టు నీరజ్ తెలిపాడు. ఫ్రాన్స్ లో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ సాంక్చూరీలో ఆ సమోసా కింద పడింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను నీరజ్ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమోసా అంతరిక్ష జర్నీ అందర్నీ ఆకట్టుకుంటుంది. మరింకెందుకాలస్యం.. మీరు ఆ అద్భుతాన్ని చూసేయండి.
Published by:Srinivas Munigala
First published:January 12, 2021, 20:56 IST