రైల్వే ప్రయాణం.. ఎంతో చౌకయినది... సుఖవంతమైనది. భారతీయ రైల్వే (Indian Railways) ప్రపంచంలోనే నాల్గవ పొడవైన రైల్వే నెట్వర్క్. అంతేకాదు ఆసియాలో రెండో అతి పెద్దది. మనదేశంలో ఉన్న మొత్తం రైల్వే ట్రాక్ పొడవు 68 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ. రైల్వే నెట్వర్క్.. దేశంలోని వివిధ భాషా సంస్కృతుల రాష్ట్రాలను ఒకే లైన్‌తో కలుపుతుంది. కోట్లాది మంది ప్రజలు రైళ్లలో తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, శతాబ్ధి, హంసఫర్, గరీభ్ రథ్, వందేభారత్ వంటి ఎన్నో రకాల రైళ్లు ఉన్నాయి. ఐతే వీటిలో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ మనదేశంలో టికెట్ అవసరం లేకుండా.. ఉచితంగా ప్రయాణించగలిగే.. రైలు ఉందంటే నమ్ముతారా?
మనదేశంలోని ఓ రైలులో ఎవరైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. టికెట్ అవసరం లేదు. టికెట్ తనిఖీ చేసేందుకు టీటీఈలు కూడా రారు. ఉచిత ప్రయాణికి విద్యార్హత, ప్రభుత్వం సేవ వంటి గుర్తింపులు అవసరం లేదు. అందరికీ ఉచితమే. అదే భాగ్రా-నంగల్ రైలు (Bhakra Nangal train).
భక్రా నంగల్ రైలును భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు (BBMB) నిర్వహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న 13 కి.మీ. రైలు మార్గంలో ఈ రైలు నడుస్తుంది. ఇది సట్లెజ్ నది గుండా వెళుతుంది. కొండకోనలు, నదుల సోయగాల మధ్య రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైలులో వెళ్లే ప్రయాణికుల నుంచి ఎలాంటి చార్జీలను వసూలు చేయరు. అందుకే ప్రతి రోజూ ఎంతో మంది ప్రజలు ఈ రైలులో ప్రయాణిస్తారు. ముఖ్యంగా భాక్రా-నంగల్ ఆనకట్ట (bhakra nangal dam) అందాలను చూడేందుకే ఎక్కువ మంది వస్తుంటారు. 70 ఏళ్లుగా ఈ రైలు మార్గం అందుబాటులో ఉంది. ఇంతకుముందు రైలులో 10 కోచ్‌లు ఉండగా.. ఇప్పుడు 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవన్నీ చెక్కతో చేసినవే..! అందుకే అన్నింటికంటే ఈ రైలు చాలా భిన్నంగా, అందంగా ఉంటుంది.
భాక్రానంగల్ డ్యామ్ నిర్మాణ పనులు 1948లో మొదలయ్యాయి. కార్మికులు, భారీ యంత్రాలను తీసుకెళ్లేందుకు వీలుగా అప్పుడు రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1963లో భాక్రానంగల్ డ్యామ్‌ను ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లా భాక్రా గ్రామంలో ఉంది. ఇది 741 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన డ్యామ్‌లో ఒకటిగా ఉంది. ఇది స్ట్రెయిట్ గ్రావిటీ డ్యామ్‌గా ప్రసిద్ధి చెందింది. మొదట డ్యామ్ నిర్మాణానికి అవసరమమ్యే కార్మికులు, సామాగ్రిని తరలించేందుకు రైలును నడిపారు. ఆ తర్వాత అదే మార్గంలో ప్రయాణికుల రైలును ఉచితంగా నడుపుతున్నారు. డ్యామ్‌కు చారిత్రక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. ఈ రైలు మార్గం కమర్షియల్ చేయలేదు. ఎందుకంటే తర్వాతి తరం వారు ఈ వారసత్వ కట్టడాన్ని చూసేందుకు రావాలని బీబీఎంబీ కోరుకుంటోంది.
అందుకే భాక్రా నంగల్ రైలును వారసత్వ సంపదగా భావించి... ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి.. స్వాగతం పలుకుతోంది బీబీఎంబీ. ఈ డ్యామ్‌ను చూసేందుకు ప్రతి రోజూ వందలాది మంది ప్రయాణికులు రైల్లో వస్తుంటారు. ఇందులో విద్యార్థులే ఎక్కువగా కనిపిస్తారు. బర్మాలా, ఒలిండా, నెహ్లా భక్రా, హండోలా, స్వామిపూర్, ఖేదా బాగ్, కలకుండ్, నంగల్, సలాంగ్డి, భాక్రా చుట్టుపక్కల గ్రామాలతో సహా అన్ని ప్రాంతాల ప్రజలు రైలులో ప్రయాణిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Himachal Pradesh, Indian Railways, Punjab