వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత జట్టు...వచ్చే నెల వెస్టిండీస్ టూర్‌కు సన్నద్ధమవుతోంది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును సెలక్షన్ కమిటీ ఈ నెల 19న ఖరారు చేయనుంది. ముంబైలో సమావేశంకానున్న సెలక్టర్లు...వరల్డ్ కప్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే జట్టును ఎంపిక చేయనున్నారు.
ఈ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీకి చోటు దక్కుతుందా? లేదా? అన్న అంశం ఆసక్తిరేపుతోంది. వరల్డ్ కప్‌లో ధోనీ సరిగ్గా రాణించలేదన్న విమర్శలు ఉన్నాయి. ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని కొందరు విమర్శకులు సూచిస్తున్నారు. అయితే వరల్డ్ కప్ టోర్నీలో ధోనీ తన కర్తవ్యన్ని సరిగ్గా నెరవేర్చాడని మరికొందరు మాజీ ఆటగాళ్లు వెనకేసుకొస్తున్నారు. అటు ధోనీ అభిమానులు...అంతర్జాతీయ క్రికెట్‌లో మరికొన్నేళ్లు పాటు కొనసాగే సత్తా ధోనీకి ఉందంటున్నారు.
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫేసర్ బుమ్రాకు టీ20, వన్డే సిరీస్‌లకు విశ్రాంతి కల్పించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పిస్తే...రోహిత్ శర్మకు టీ20, వన్డే సిరీస్‌కు సారథ్యపగ్గాలు అప్పగించే అవకాశముంది. గాయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీ మధ్యలో జట్టుకు దూరమైన శిఖర్ థావన్...వెస్టిండీస్ టూర్‌కు అందుబాటులో ఉంటాడో? లేదో? తెలియరావడం లేదు.
భారత జట్టులోని ఆటగాళ్లు రెండు వర్గాలుగా కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య చీలిపోయారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చేలా సెలక్షన్ కమిటీ జట్టు కూర్పు చేపట్టే అవకాశముంది.
భారత్-వెస్టిండీస్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ఆగస్టు 3 నుంచి ప్రారంభంకానుంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్న భారత జట్టు...ఆగస్టు 22 తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, ICC Cricket World Cup 2019, MS Dhoni, Team India