మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ, మానవత్వాన్ని మంటగలుపుతున్న ఘటనలు దేశంలో ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కోతులను చిత్రహింసలు పెట్టడం.. ఆవు నోటిలో టపాసులు పేల్చడం వంటి దారుణాలు మరవక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. ఓ యువకుడు కుక్కను చెరువులోకి విసిరేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియా యాప్ స్నాక్లో పోస్ట్ చేసేందుకు వీడియో తీశాడా యువకుడు. అనంతరం నవ్వుతూ రాక్షసానందం పొందాడు. ఈ వీడియో వైరల్గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.
కుక్కను చెరువులోకి విసిరేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. బ్రిడ్జి పై నుంచి బడా తలాబ్ చెరువులోకి కుక్కను విసిరేశాడు. అనంతరం ఆ వీడియోను స్నాక్ యాప్లో పోస్ట్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్లో హిందీ మూవీ కమాండో 3 పాట వినిపించింది. దీనిపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వీడియో ఆధారంగా ఇప్పటికే నిందితుడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐతే సరదా కోసమే ఇలా చేశానని.. అది నేరమనే విషయం తనకు తెలియదని అతడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. జంతు ప్రేమికులు మాత్రం అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:September 14, 2020, 16:04 IST