Miniature: వారి హస్తకళాకారులకు గుర్తింపు.. జీఐ ట్యాగ్ దిశగా అంబసముద్రం మినియేచర్ బొమ్మలు..

మినియేచర్ బొమ్మలు

తమిళనాడు అంబసముద్రం ప్రాంతానికి చెందిన హస్తకళాకారులు 200 ఏళ్లుగా తమ వృత్తినే నమ్ముకున్నారు. చెక్క, లక్కతో అందమైన బొమ్మలను కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న సైజులో ఉండే ఈ మినియేచర్ బొమ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉంది. అయితే తాజాగా వీరి ప్రతిభ, శ్రమకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది.

  • Share this:
భారత్‌లో హస్త కళాకారులు, ఈ రంగంలో నిపుణులకు కొదవే లేదు. అయితే పెట్టుబడిదారి వ్యవస్థ.. ఎంతో మంది పేద కళాకారుల పాలిట శాపంగా మారింది. దీనికి తోడు పేదరికంతో ఎంతోమంది హస్తకళాకారులు తమ వృత్తులను వదిలి ఇతర పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే తమిళనాడు అంబసముద్రం ప్రాంతానికి చెందిన హస్తకళాకారులు మాత్రం 200 ఏళ్లుగా తమ వృత్తినే నమ్ముకున్నారు. చెక్క, లక్కతో అందమైన బొమ్మలను కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న సైజులో ఉండే ఈ మినియేచర్ బొమ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉంది. అయితే తాజాగా వీరి ప్రతిభ, శ్రమకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది. త్వరలోనే వీరు తయారు చేసిన చెక్క బొమ్మలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ సొంతమయ్యే అవకాశముంది. ఈ మేరకు జీఐ ఏజెంట్‌కు స్థానిక స్వచ్చంద సంస్థలు దరఖాస్తు చేశాయి. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు తిరునల్వేరి జిల్లాలోని అంబసముద్రం.. హస్తకళాకారులకు నెలవు. ఇక్కడ ఉండే ఎంతో మంది హస్తకళాకారులు పిల్లల కోసం సూక్ష్మ బొమ్మలు(Miniature Toys), వారు ఆడుకునే కిచెన్ సెట్లను తయారు చేస్తారు. మనలో చాలా మందికి ఇలాంటి కిచెన్ టాయ్స్‌తో ఆడుకున్న జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. వాటిని ఇక్కడే తయారు చేస్తున్నారు. నాణ్యత, రంగుల్లో కచ్చితత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. స్థానికంగా వీటిని 'చొప్పు సామాన్' గా పిలుస్తారు. అంబసముద్రం వాసులు ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలోనే ఈ బొమ్మలను తయారు చేస్తున్నారు.

సెప్టెంబరులో సేల్స్ ఎక్కువ..
చిన్నగా ఉండే ఈ బొమ్మలు అమ్మకాలు ఏడాది పొడవుగా బాగానే ఉన్నప్పటికీ ప్రధానంగా సెప్టెంబరు మాసంలో అధిక విక్రయాలు ఉంటాయి. ఈ సమయంలో తమిళనాడులో నవరాత్రి గోలు పండుగను విస్తృతంగా జరుపుకుంటారు. ఈ బొమ్మల మార్కెట్ వివిధ మార్పులకు, ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ.. వాటిని రూపొందించే యాంత్రాంగం, కళాకారులు మాత్రం ఈ పనిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కొత్త తరం ఆవిష్కరణలు ఉన్నప్పటికీ అంబసముద్రంలో మాత్రం సంప్రదాయ పద్ధతిలోనే బొమ్మలు తయారు చేస్తున్నారు.

ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు..
ఈ ఎకో ఫ్రెండ్లీ బొమ్మలను రీసైక్లింగ్ కూడా చేయవచ్చు. ఎందుకంటే సహజ రంగులు, స్కూఫైన్ వంటి సహజ వనరుల నుంచి ఇవి తయారవుతాయి. బయలాజికల్లీ పాండనస్ అమరిల్లిఫోలియస్, సీజన్డ్ వుడ్స్, విష రహిత సమ్మేళనాలతో తయారు చేస్తారు. సెప్టెంబరు నెలలో తమిళనాడులో ప్రసిద్ధమైన నవరాత్రి గోలు పండుగలో దేవతల ఆరాధన కోసం ఈ బొమ్మలను తీసుకెళ్తారు. దేవతల సూక్ష్మ విగ్రహాలు, వంటగది పాత్రలు, స్పిన్నింగ్ బొమ్మలను చేతితోనే తయారు చేస్తారు. వీటితో పాటు నగల పెట్టెలు, రైళ్లు, విమానాలతో పాటు ఇతర మినియేచర్ బొమ్మలు, వస్తువులను రూపొందించడంలోనూ ఇక్కడి కళాకారులకు ప్రావీణ్యం ఉంది. అయితే జీఐ గుర్తింపు దక్కితే వీరి శ్రమకు మరింత ప్రతిఫలం లభించే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published: