IN A RARE CASE OF SNAKE BITE PATIENT RECOVERS AFTER COMPLETE SHUTDOWN OF KIDNEYS GH VB
Snake Bite: వైద్య చరిత్రలో అద్భుతం.. కిడ్నీలు ఫెయిలైన పేషెంట్ పూర్తిగా రికవరీ.. ఎలా సాధ్యమైందంటే..?
ప్రతీకాత్మక చిత్రం
శరీరంలో రక్తాన్ని శుద్ధిచేసి మూత్రాన్ని తయారుచేసే మూత్రపిండాలు (Kidneys) దెబ్బతింటే.. అవి పూర్తిగా నయం కావడం దాదాపు అసాధ్యమే. కిడ్నీలు పూర్తిగా వైఫల్యం చెందితే (complete kidney failure) వైద్య సాయంతోనే బతకాల్సి ఉంటుంది
శరీరంలో రక్తాన్ని శుద్ధిచేసి మూత్రాన్ని తయారుచేసే మూత్రపిండాలు (Kidneys) దెబ్బతింటే.. అవి పూర్తిగా నయం కావడం దాదాపు అసాధ్యమే. కిడ్నీలు పూర్తిగా వైఫల్యం చెందితే (complete kidney failure) వైద్య సాయంతోనే బతకాల్సి ఉంటుంది. అయితే తాజాగా వైద్య చరిత్రలోనే ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఓ అరుదైన కేసులో కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన ఓ మహిళ ఆరు వారాల్లోనే పూర్తిగా రికవరీ అయింది. వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ నెలలో ఓ 30 ఏళ్ల మహిళ ఒక పాము కాటు (snake bite)కు గురైంది. దీంతో ఆమె హెచ్‌యూఎస్ (HUS) అనే అరుదైన సిండ్రోమ్ బారినపడింది. దీనివల్ల ఆమె కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేశాయి. కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఆమె ఆరు వారాలపాటు డయాలసిస్ (రక్తశుద్ధి -dialysis)పైనే ఆధారపడింది.
ఆ తర్వాత కిడ్నీల సమస్య నుంచి పూర్తిగా రికవర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వైద్య చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం చాలా అరుదని పుణె (Pune)లోని నోబుల్ ఆసుపత్రి (Noble Hospital) వైద్యులు తాజాగా వెల్లడించారు. ముందు హాస్పిటల్లో చేరేనాటికి ఆమె శరీరం పూర్తిగా వాచిపోయింది. దీనికి కారణం ఆమె శరీరంలోని కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేయడమేనని వైద్యులు గుర్తించారు. అనంతరం ఆమెను హుటాహుటిన ఐసీయూలో చేర్చారు. రక్తపరీక్షల్లో ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తేలింది.
వివిధ వైద్య పరీక్షల తర్వాత, పాము కాటు కారణంగా సంభవించే హెమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ (HUS) అనే అరుదైన సిండ్రోమ్‌తో ఆమె బాధపడుతున్నట్లు నోబుల్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత కూడా ఇదే సిండ్రోమ్‌తో ఆమె బాధపడుతున్నట్లు మరోసారి నిర్ధారించుకున్నారు. నోబుల్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ ప్లాంట్ వైద్యుడు డాక్టర్ అవినాష్ ఇగ్నేషియస్ ఈ విషయాలను వెల్లడించారు.
“ఆమెకు అత్యవసరంగా డయాలసిస్ అవసరమైంది. హెచ్‌యూఎస్ నిర్ధారణ అయిన వెంటనే ప్లాస్మాఫెరిసిస్ ప్రారంభించాం. ఎందుకంటే చికిత్సలో జాప్యం చేస్తే ఆమె కిడ్నీలు కోలుకోలేని విధంగా పాడుకావచ్చు. అది ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. ప్లాస్మాఫెరిసిస్ సమయంలో కలుషితమైన ప్లాస్మాని ప్రత్యేక ప్లాస్మా-ఫిల్టర్ ద్వారా తొలగించాం. అలాగే ఆరోగ్యకరమైన ప్లాస్మాతో భర్తీ చేశాం. ఆమె ఆరు వారాల పాటు డయాలసిస్‌పైనే ఉండిపోయింది.
ఈ ఆరు వారాల్లో ఆమె మూత్ర విసర్జన మెరుగుపడింది. తరువాత మేం డయాలసిస్‌ను నిలిపివేశాం. ఆమె ఇప్పుడు బాగానే ఉంది. ఆమె మూత్రపిండాల పనితీరు కోలుకుంది. ఆమెకు ఇప్పుడు డయాలసిస్ అవసరం లేదు. ఇది చాలా అరుదైన కేసు. ఇండియన్ జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీలో ప్రచురించిన అధ్యయనాల ప్రకారం.. హెచ్‌యూఎస్, పూర్తి మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగులతో ప్రపంచవ్యాప్తంగా 30 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి." అని డాక్టర్ ఇగ్నేషియస్ పేర్కొన్నారు.
“మహిళా రోగిలో, మూత్రపిండ వైఫల్యానికి కారణం థ్రోంబోటిక్ మైక్రోఅంజియోపతి (TMA) అని చెప్పవచ్చు. అంటే మూత్రపిండాలకు రక్తాన్ని సరఫరా చేసే సూక్ష్మ రక్తనాళాల్లో వాపు వచ్చి.. ఈ మైక్రోక్లాట్లు రక్తనాళాల ల్యూమన్లను మూసివేయడం." అని ఒక డాక్టర్ వెల్లడించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.