87 ఏళ్ల బామ్మ చీర్స్ చెబుతుంటే.. రోహిత్ శర్మ రెచ్చిపోయాడుగా.. కోహ్లీ అయితే..

ICC Cricket World Cup 2019 | IND vs BAN | ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ప్రత్యక్షమైన ఓ టీమిండియా ఫ్యాన్.. మ్యాచ్ మొత్తాన్ని తనవైపు తిప్పేసుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 3, 2019, 8:55 AM IST
87 ఏళ్ల బామ్మ చీర్స్ చెబుతుంటే.. రోహిత్ శర్మ రెచ్చిపోయాడుగా.. కోహ్లీ అయితే..
టీమిండియా ఫ్యాన్ చారులతతో విరాట్ కోహ్లీ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
నుదుట బొట్టు.. చెంపలకు త్రివర్ణం.. చేతిలో బూర.. మెడలో జాతీయ జెండాతో స్టేడియంలో అడుగు పెట్టిందో 87 ఏళ్ల బామ్మ. ఈ వయసులో ఆమె క్రికెట్ చూడ్డానికి రావడం అవసరమా అనుకున్నారు అక్కడున్నవారు. పోనీలే! ఏదో సరదా పడ్డట్లు ఉంది.. అందుకే తీసుకొచ్చారేమో అని తమతో తాము మునిగిపోయారు. కానీ, వారికి తెలీలేదు.. ఆమె క్రికెట్ వరల్డ్ కప్ 2019కే హైలైట్ అయ్యిందని. వారు అనుకోలేదు.. ఆమె టీమిండియా క్రికెటర్లను కలుస్తుందని. వారు ఊహించలేదు.. ఆమె సోషల్ మీడియాను హీటెక్కిస్తుందని. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ప్రత్యక్షమైన ఓ టీమిండియా ఫ్యాన్.. మ్యాచ్ మొత్తాన్ని తనవైపు తిప్పేసుకుంది. మైదానంలో ఉన్న క్రికెటర్లు కూడా ఆమె జోష్‌ను చూసి మురిసిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె ఏ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందో. ఆమె పేరు.. చారులత పటేల్, గుజరాత్‌కు చెందిన వృద్ధురాలు.

మ్యాచ్ జరుగుతున్నంతసేపు టీమిండియా క్రికెటర్లలో జోష్ నింపింది. మనోళ్లు ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. ఈలలు వేసింది, డ్యాన్సులు చేసింది, నినాదాలతో హోరెత్తించింది. ఆమెను చూసిన రోహిత్ శర్మ కూడా రెచ్చిపోయాడు. సిక్సులు, ఫోర్లు కొడుతూ ఆమెతో పాటు, ఫ్యాన్స్‌ను అలరించాడు. సెంచరీతో కదం తొక్కాడు. మ్యాచ్ ముగిశాక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వెళ్లి ఆమెను కలిసి, ముచ్చటించారు. వారితో మాట్లాడుతుంటే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారిని హృదయానికి హత్తుకున్న చారులత.. ముద్దిచ్చి, ఆశీర్వదించింది.

టీమిండియా క్రికెటర్లే కాదు.. టీవీల్లో ఆమెను చూస్తూ ఎంతో మంది భారతీయులు ‘సూపర్ బామ్మ’ అనుకున్నారు. అప్పటి వరకు మ్యాచ్ లైవ్ చూడని బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను చూడ్డానికే టీవీ ఆన్ చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమెకు టికెట్ స్పాన్సర్ చేయొచ్చుగా అని ఓ నెటిజన్ ఆయన్ను ప్రశ్నించగా.. ‘ఆమె ఎక్కడుంటారో కనుక్కోండి.. ఇకనుంచి భారత్ ఆడే మ్యాచ్‌లన్నింటికీ టికెట్ స్పాన్సర్ చేస్తా’నని వెల్లడించారు.

మ్యాచ్ అనంతరం ఆమెను మీడియా ఇంటర్వ్యూ చేయగా.. భారతే వరల్డ్ కప్ గెలుస్తుందని, భారత్ గెలవాలని గణనాథుడిని ప్రార్థిస్తానని, టీమిండియా క్రికెటర్లంతా తన బిడ్డలేనని, వారికి తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని అన్నది.


First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు