Viral Video: ఓ చిరుత పులి మన కళ్ల ముందు ఉంటే మన పరిస్థితి ఏంటి? అది వేటాడాలి అని అనుకుంటే... ఇక మనం తప్పించుకోగలమా... లేదు కదా... కానీ ఓ చిరుతపులి మాత్రం... దారిన పోయే ప్రయాణికుల కాళ్లా వేళ్లా పడి బతిమలాడింది. తనకు ఇంత ఆహారం ఉంటే పెట్టమని వేడుకుంది. ఐతే... మనలా మాట్లాడలేదు కదా... అందువల్ల అది ఏదో అడుగుతోందన్న విషయం ప్రజలకు అర్థం కాలేదు. అందువల్ల అది తమతో పిల్లిలా ఆడుకుంటుందేమో అనుకున్నారు. ఆ చిరుతపులికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఇలా ఎక్కడైనా జరుగుతుందా... చిరుతపులి వచ్చి మనుషుల్ని బతిమలాడటమేంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇది జరిగింది హిమాచల్ ప్రదేశ్లోని కుల్లూ ప్రాంతంలో. అక్కడి తీర్తాన్ లోయలో... ఓ రోడ్డు ఉంది. అటుగా ప్రయాణికులు వెళ్తుండగా... ఓ చిరుతపులి అడ్డగించింది. మొదట దాన్ని చూసిన వాళ్లు కిక్కురు మనకుండా ఎవరి కార్లలో వాళ్లు ఉండిపోయారు. కానీ... బైకులపై వచ్చే వాళ్లు ఉంటారు కదా... అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లి చిరుతపులి ఏమీ అనకుండా వాళ్లతో సరదాగా ఉండటం అంతా చూశారు. ఆశ్చర్యపోయారు. ఈ చిరుతపులి ఏమీ చెయ్యట్లేదేంటీ... అనుకున్నారు. దానితో ఫొటోలు, వీడియోలూ తీసుకోవాలని ముచ్చటపడ్డారు. కార్లు దిగి దాని దగ్గరకు వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి ఒక్కరి కాళ్లపైనా పడి... చిరుతపులి బతిమలాడ సాగింది. తన ముందు రెండు కాళ్లనూ పైకి ఎత్తి మరీ తనకు ఆహారం కావాలని వేడుకుంది. ఆకలి వేస్తోందని మొత్తుకుంది. కానీ... ఆ భాష ఎవరికీ అర్థం కాలేదు. అది తమతో ఆడుకుంటోందని అనుకున్నారు.
IAS ఆఫీసర్ సంజీవ్ గుప్తా కూడా ఇలాంటి ఓ వీడియోని షేర్ చేశారు. అందులో కూడా ఆ చిరుత మరో వ్యక్తిని బతిమలాడిన దృశ్యాలున్నాయి.
చిరుతపులి అనగానే వేటాడే వన్య మృగంగానే మనం చూస్తుంటాం. కానీ... నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అవి కూడా మనలాగే... ఇతరుల సాయం కోరతాయని ఈ ఘటనలు చెబుతున్నాయి. ఈ వీడియోలను చూసి కొందరు నెటిజన్లు భలే ఉంది అనుకుంటుంటే... మరి కొందరు అయ్యో పాపం అంటున్నారు. ఏది ఏమైనా ఇలా వన్యప్రాణుల దగ్గరకు మనుషులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.
Published by:Krishna Kumar N
First published:January 16, 2021, 11:57 IST