హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Maha Shivaratri : మహా శివరాత్రి రోజున శివ పూజ ఇలా చేయాలి..

Maha Shivaratri : మహా శివరాత్రి రోజున శివ పూజ ఇలా చేయాలి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maha Shivaratri : హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర.. అంటూ ముక్కంటి ఆలయాలన్నీ ముక్తకంఠంతో మార్మోగిపోయే సందర్భం వచ్చేసింది..

Maha Shivaratri : హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర.. అంటూ ముక్కంటి ఆలయాలన్నీ ముక్తకంఠంతో మార్మోగిపోయే సందర్భం వచ్చేసింది.. శివోహం అంటూ భక్త జనకోటి శివనామస్మరణలో ఊగిపోయే సమయం ఆసన్నమైంది.. మహా శివరాత్రి పర్వదినానికి వేళైంది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజు వచ్చే మహా శివరాత్రి.. శివునికి అత్యంత ఇష్టమైనది. సృష్టి, స్థితి, లయల్లో.. లయకారకుడు శివుడు. అలాగని ఆయన శక్తికి పరిమితి లేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదన్న సామెత ఉంది. అలా శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రి అంటారు. ఇదే రోజు శివుడు, పార్వతిదేవి వివాహం జరిగిందని కూడా అంటారు. ఈ రోజున చాలామంది ఉపవాసం, జాగరణ చేస్తారు. ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది. రోజంతా ఏం తినకుండా.. రాత్రి కూడా నిద్ర పోకుండా భక్తులు శివుడిని కొలుస్తారు. అయితే, ఈ రోజున శివుడిని ఎలా కొలవాలి. ఎలా పూజ చేయాలి.. తదితర నియమాలు తెలుసుకోవాల్సిందే.

అమర్‌నాథ్ మంచు లింగం

ప్రతీ ఒక్కరిని కాపాడే ఆ పరమాత్మని ఎంతో భక్తితో పూజించాలి. ముఖ్యంగా శివరాత్రి పూజ విధానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది.. శివరాత్రి పూజ, నవరాత్రి పూజలానే దీక్షగా చేయాలి. ఈ రెండింటికి ఓ సంబంధం ఉంది. అదేంటంటే.. రాత్రి సమయంలో పుట్టినందుకు రాత్రి సమయంలో తనకి పూజ జరిగేందుకు ఇవ్వమని సాక్షాత్తూ శివుడే అడగ్గా.. అమ్మవారు అందుకు ప్రతిఫలంగా.. నవరాత్రుల పూజలు కోరుకున్నట్లు చెబుతారు.

శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. నిత్యం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతారు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి.. దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెబుతుంటారు. మహా శివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్కపూట భోజనం, శారీరక, మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించడం వంటివి చేయనే కూడదు.

ఓం నమ: శివాయ అంటూ ధ్యానం  చేయడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది.

శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం అంత శ్రేష్టమైంది. శివరాత్రి ఉదయం యథాతథంగా నిత్యకృత్యాలు చేయాలి. రోజూ చేసే పూజను చేస్తూనే సంధ్యావందనాలు చేయాలి. శివార్చన చేయాలి.. పూజాగదిలో తడిబట్టలు వదిలి పొడిబట్టలు వేసుకుని శివుడిని పెట్టే స్థలంలో అష్టదళాన్ని పెట్టి దాని ఎదురుగా నందిని పెట్టాలి. శివ పరివాహాన్ని ఆవాహన చేసి పూజ చేయాలి. ఈ రోజు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది.

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।

త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ||

అంటూ బిల్వార్చన చేయాలి. ఉదయం పూజ చేసి, మధ్యాహ్నాం, సాయంత్రం మరోసారి పూజ చేసి అర్ధరాత్రి వరకైనా అభిషేకం చేయాలి.

శివ లింగం (Image: AP)

శివరాత్రి మహత్యమంతా రాత్రి వేళల్లోనే వుంటుంది. అందుకే భక్తజనులందరూ ఈ రాత్రి పూట భజనలు- పురాణ కాలక్షేపం- లేదంటే శివనామస్మరణతో గడుపుతారు. కొందురు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృపా కటాక్షాలను పొందుతారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ‘ఓం నమ: శివాయ’ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిజాముకి పూజ, అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్యకృత్యాలు తీర్చుకొని, సంధ్యావందనం చేసి పుష్పాలు, అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి.

research on Mahamrityunjaya Mantra, Rudra Mantra, Tryambakam Mantra, Rigveda, lord shiva, మహా మృత్యుంజయ మంత్రం, మోదీ సర్కారు, కేంద్రం, తాజా వార్తలు, రుగ్వేదం, త్రయంబకం, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, delhi, ram manohar lohia hospital,
పరమేశ్వరుడు

ఉపవాసాల్లో విధానాలు:

రోజంతా ఉపవాసం వుండి ఆ మరునాటి ఉదయం భోం చేయడం ఒక పద్ధతి. కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోజనం చేయడం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటి పూట ఏదో ఒకటి తిని.. రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్ని ఏక భుక్తం అంటారు.

మహా శివరాత్రి మహత్యం:

దేవతలు, రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలికే సమయంలో అందులో నుండి తొలుత కామధేనువు వచ్చింది. అది వశిష్టుడికి ఇచ్చారు. ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది. దానిని దేవేంద్రుడు తీసుకున్నాడు. మరోసారి చింతామణి పీఠం వచ్చింది. దాన్ని కూడా దేవేంద్రుడే తీసుకున్నాడు. మరోసారి చంద్రుడు వచ్చాడు. ఆకాశానికి పంపించేశారు. ఆ తర్వాత మదనం చేయగా విషం వచ్చింది. దీన్ని చూసి భయపడ్డ దేవతలు లోకాన్ని కాపాడాలని శివుడిని వేడుకుంటారట. దాంతో మహా శివుడు వెంటనే(మహాశివరాత్రి రోజున) ఆ విషాన్ని మింగేస్తాడట. కడుపులోకి మింగకుండా కంఠంలోనే ఉంచుతాడు. దాంతో ఆయన కంఠం నీలంగా మారిపోయిందని, అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అని పేరు కూడా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. విషాన్ని మింగి లోకాన్ని కాపాడినందున.. ఆ రోజు శివుడిని ఆరాధించి, అభిషేకించి విషం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి స్వాంతన చేకూర్చి.. పరమేశ్వరుడి ఆశీస్సులు పొందవచ్చని వివరిస్తున్నాయి.

అంతేకాదు.. శివుడు ఆరుద్ర నక్షత్రంలో లింగాకారంలో ఆవిర్భవించిన కాలంగా చెబుతారు. శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే.. అందుకు బ్రహ్మ, విష్ణువుల మధ్య వచ్చిన తగవు కారణం అని చెబుతోంది శివపురాణం. బ్రహ్మ - విష్ణువుల మధ్య వచ్చిన ఆధిపత్య సమస్యను తీర్చడంలో భాగంగా శివుడు అగ్ని స్థంభంగా ఆవిర్భవిస్తాడట. దాని ఆది, అంతములు ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని అంటాడట. అగ్ని స్థంభం మొదలు చూడ్డానికి బ్రహ్మ.. అంతం చూడ్డానికి విష్ణువు బయలు దేరుతారు. అంతం కనుగొన లేక పోయిన విష్ణువు వెనుదిరగగా.. దారి మధ్యలో కనిపించిన కామధేనువు, మొగలిపువ్వును చూసి.. బ్రహ్మ తాను మొదలు కనుక్కున్నానని అంటాడట. కానీ అది నిజం కాదు. తన ఓటమి ఒప్పుకున్న విష్ణువుకు తనతో సమానమైన పూజలందుతాయని వరమిస్తాడట శివుడు.

అలాగే బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఉపయోగపడిన మొగలి పూవు పూజార్హం కానిదని, కామధేనువు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందువల్ల గోవు వెనుక భాగం పూజనీయం అవుతుందని వరమిస్తాడు పరమేశ్వరుడు. అంతే కాదు అబద్ధం చెప్పిన బ్రహ్మ ముఖాన్ని కత్తిరిస్తాడు. ఇలా శివ లింగం ఆవిర్భవించడం వెనుక ఇంత కథ దాగి వుంది. అందుకే మహా శివరాత్రికి ఎంతో విలువనిస్తారు హైందవులు.

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్త్ర || అంటూ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే సకల రోగబాధలూ తగ్గి పూర్ణాయుష్షు లభిస్తుందని చెబుతారు. ఇలా శివరాత్రి రోజున శివుడికి సంబంధించిన స్నాన- ఉపవాస- అభిషేక- అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది శివపురాణం.

- సర్వే జనాం సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి:

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Bhakti, Devotional, Mahashivratri

ఉత్తమ కథలు