How to Control Wife: భార్యను అదుపులో పెట్టడం ఎలా? గూగుల్‌లో భర్తల గగ్గోలు

ప్రతీకాత్మక చిత్రం

సుదీర్ఘ లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇళ్లలో బంధీలుగా మారడంతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ముఖ్యంగా పురుషుల్లో పెరిగిన ఫ్రస్టేషన్​ ఎవరి మీద చూపించాలో తెలియక తమ భార్యలపై చూపించారని, ఫలితంగా మహిళలపై హింస గరిష్ట స్థాయికి చేరుకుందని అధ్యయనం వెల్లడించింది.

  • Share this:
మనకు తెలియని విషయాల గురించి గూగుల్​లో వెతికేస్తుంటాం. మన ప్రతి సందేహానికి గూగుల్​ టక్కున సమాధానం చెబుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గూగుల్​కు అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే టెక్నాలజీతో ఎంత మంచి ఉందో.. అంత చెడు కూడా ఉందనేది వాస్తవం. ఈ మధ్య గూగుల్​లో చెడు కోసం వెతికేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ విషయం మరోసారి రుజువైంది. గతేడాది కరోనా వైరస్​ విజృంభనతో భారత్​తో సహా అనేక దేశాలు లాక్​డౌన్​ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కంపెనీలన్నీ వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ప్రకటించాయి. ఇక విద్యాభోదన ఆన్​లైన్​కు మారింది. ఈ సమయంలో ప్రజలు గూగుల్​లో ఎలాంటి విషయాలను వెతికారనే దానిపై న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్​ఫ్లిక్ట్ స్టడీస్‌ అధ్యయనం నిర్వహిచింది. ఇందులో భార్యలపై ఎలా పైచేయి సాధించాలని ఎక్కువమంది మగవాళ్లు గూగుల్‌లో వెతికినట్టు సర్వే గుర్తించింది. వారి అధ్యయనంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి.

లాక్​ డౌన్ సమయంలో​ ప్రపంచవ్యాప్తంగా గృహహింస గణనీయంగా పెరిగిందన్న ఆందోళనకరమైన అంశం బయటపడింది. సుదీర్ఘ లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇళ్లలో బంధీలుగా మారడంతో వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ముఖ్యంగా పురుషుల్లో పెరిగిన ఫ్రస్టేషన్​ ఎవరి మీద చూపించాలో తెలియక తమ భార్యలపై చూపించారని, ఫలితంగా మహిళలపై హింస గరిష్ట స్థాయికి చేరుకుందని అధ్యయనం వెల్లడించింది. టేలర్ అండ్​ ఫ్రాన్సిస్ జర్నల్‌లో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. ఈ పరిశోధనకు ఒటాగో విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కాటెరినా స్టాండిష్ నాయకత్వం వహించారు. ఆమె గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి సమయంలో గృహహింస, మహిళల హత్యలపై పరిశోధన చేస్తున్నారు. లాక్​డౌన్​ సమయంలో చాలా మంది పురుషుల్లో అభద్రత, నిరాశ, నిస్సహాయత పెరిగిందని, దీంతో ఉద్దేశపూర్వకంగానే భర్తలు తమ భార్యలపై హింసకు పాల్పడ్డారని, ఈ హింస 31% నుండి 106% వరకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు.

లాక్​డౌన్​తో పురుషుల్లో పెరిగిన ఫ్రస్టేషన్​
లాక్​డౌన్​ సమయంలో చాలా మంది పురుషులు ‘భార్యను అదుపులో పెట్టడం ఎలా?’.. ‘ఎవ్వరికీ తెలియకుండా భార్యను ఎలా కొట్టాలి?’ అనే విషయాలను గూగుల్​లో 16.50 కోట్ల సార్లు సెర్చ్​ చేశారని కాటెరినా స్పష్టం చేశారు. అదేవిధంగా "భార్యను ఇంట్లోనే ఎలా చంపాలి?" అనే విషయాన్ని 17.80 కోట్ల సార్లు స్టెర్చ్​ చేశారని అధ్యయనంలో తేలింది. ఇక, భర్తల హింస తట్టుకోలేక భార్యలు "నా భర్త నన్ను చంపేస్తాడు" అని 10.7 కోట్ల సార్లు, ‘నన్ను కొడతాడు’ అని 32 కోట్ల సార్లు గూగుల్​లో సెర్చ్​ చేశారని తేలింది. "దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని అనేక మంది మహిళలు 1.22 బిలియన్ సార్లు గూగుల్​లో వెతికారని అధ్యయనం పేర్కొంది.

ఈ డేటాను సేకరించిన విధానాన్ని కాటెరినా వివరించారు. ‘కరోనా లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమవ్వడంతో, తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక, గూగుల్​ను ఆశ్రయించారు. అసలు ఈ లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఎలాంటి విషయాలను సెర్చ్​ చేశారో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం నిర్వహించాను. నా అధ్యయనంలో మహిళలు గృహ హింస ఎదుర్కొన్నారనే ఆందోళనకరమైన అంశం బయటపడింది’ అని ఆమె చెప్పారు. భారత్‌లో కూడా లాక్‌డౌన్ సమయంలో ఎక్కువ గృహ హింస కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Published by:Shiva Kumar Addula
First published: