కోవిడ్ మహమ్మారి (Covid Pandamic) ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. 18 నెలలుగా అయినవారిని దూరం చేసి మానసిక వేదనను మిగిల్చింది. ఇలాంటి సమయంలో ఆర్థిక సమస్యలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ముఖ్యంగా చనిపోయిన వారు ఏవైనా హోమ్‌లోన్ తీసుకుని రుణాన్ని(Loan) పూర్తిగా తీర్చకపోతే ఏం చేయాలి? ఎలాంటి నిబంధనలు ఉంటాయనే ప్రశ్నలు చాలా మంది మదిలో వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కో-అప్లికెంట్‌గా సంతకం చేసిన వ్యక్తి మిగిలిన లోన్ ను చెల్లించాలి.
* హోమ్ లోన్ ఇన్సూరెన్స్
అయితే అంతకంటే ముందు చనిపోయిన రుణగ్రస్తుడు తన హోమ్‌లోన్ పై ఇన్సూరెన్స్ తీసుకున్నారా లేదా అనేది చూడాలి. లేదా లోన్ చెల్లించాల్సిన బ్యాంకును ఈ విషయంపై సంప్రదించాలి. కస్టమర్ రుణాన్ని పూర్తిగా చెల్లించకుండా దురదృష్టవశాత్తు మధ్యలోనే చనిపోతే వారికి హోమ్ లోన్ ఇన్సూరెన్స్ రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. మిగిలిన బకాయి మొత్తాన్ని రుణదాతకు బీమా కంపెనీ చెల్లిస్తుంది.
హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ప్లాన్. ఈ ప్లాన్ లో రుణగ్రస్తుడు చనిపోతే.. అతడు బకాయి పడ్డ మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ సదరు బ్యాంకుకు చెల్లిస్తుంది. అంటే కవరేజ్, బకాయి ఉన్న లోన్ కాలవ్యవధితో తగ్గుతుంది. రెండోది లెవల్ కవర్ ప్లాన్. ఇందులో రుణ కాలవ్యవధిలో బీమా కవర్ అలాగే ఉంటుంది. ఉదాహరణకు చనిపోయిన వ్యక్తి కోటి రూపాయలకు బీమా కవరేజీని తీసుకుని 50 లక్షల రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించారనుకుందాం. అప్పుడు బీమా కంపెనీ 50 లక్షల బకాయిలను బ్యాంకుకు తిరిగి చెల్లిస్తుంది. రుణగ్రహీత కుటుంబానికి మిగిలిన 50 లక్షలు ఇస్తుంది.
* బీమా కంపెనీ క్లెయిమ్ తిరస్కరిస్తుందా?
ఈ ప్రశ్నకు అవుననే చెప్పాలి. ముందుగానే అనారోగ్య పరిస్థితులుంటే ఆ విషయం బీమా కంపెనీకి చెప్పనట్లయితే అది ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ ను ఉల్లంఘించినట్లు అవుతుంది. హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ అనేది కేవలం సహజ లేదా ప్రమాదావశాత్తు జరిగిన మరణాలకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులు ఖరీదైనవి. కాబట్టి రుణదాత లోన్ అమౌంట్లో ప్రీమియంను జత చేయవచ్చు. కొంతమంది వ్యక్తులు బీమా రక్షణతో హోమ్‌లోన్ తీసుకుంటారు. అనంతరం చౌకైన గృహరుణం కోసం మరొక బ్యాంకును ఆశ్రయిస్తారు. అలాంటి సమయంలో బీమా తిరస్కరణకు గురవుతుంది.
* హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ లేకుండా రీపేమెంట్..
హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ లేకపోతే రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత సహరుణగ్రస్తుడిపై పడుతుంది. లోన్ ఈఎంఐల కోసం బ్యాంక్.. హోమ్‌లోన్ గ్యారెంటర్, చట్టపరమైన వారసులను కూడా సంప్రదిస్తుంది. రుణగ్రహీత మరణించిన సందర్భంలో రీపేమెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి బ్యాంక్ కారుణ్య ప్రాతిపదికన సహాయం చేస్తుంది. రీపేమెంట్ కోసం బ్యాంక్ గడువు, సౌలభ్యాన్ని అందిస్తుంది.
* రుణదాత ఆస్తిని స్వాధీనం చేసుకుంటుందా?
ఈ ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. కుటుంబం లేదా చట్టపరమైన వారసులు బాకీ ఉన్న రుణాన్ని తిరిగి చెల్లించకపోతే రుణదాత SAFAESI చట్టం ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు. అనంతరం బకాయిలను తిరిగి పొందడానికి వేలం వేస్తారు. అయితే దీన్ని బ్యాంకు చివరి ఆప్షన్ గానే ఎంచుకుంటుంది. ఆస్తిని స్వాధీనం చేసుకునేముందు రుణ సంస్థలు.. సహా రుణగ్రస్తులు, చట్టపరమైన వారసులకు తగినంత సమయాన్ని ఇస్తాయి. హోమ్‌లోన్ ఓవర్ డ్యూ 90 రోజుల గడువు ముగిసినత తర్వాత మాత్రమే బ్యాంక్ NPA(Non Performing Asset)గా వర్గీకరిస్తుంది. అనంతరం సహ రుణగ్రస్తునికి 60 రోజుల్లోపు రుణాన్ని రిలీవ్ చేయాలని రాతపూర్వక అభ్యర్థనను నోటీసు రూపంలో ఇస్తుంది. అప్పుడు కూడా వారి నుంచి స్పందన రాకపోయినా లేదా 30 రోజుల తర్వాత సహ రుణగ్రస్తుల వివరణకు సంతృప్తి చెందకపోయినా.. ఆ ఆస్తిని బ్యాంక్ బహిరంగంగా విక్రయించేందుకు ముందుకు వెళ్తుంది.
ఇందుకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ మరో 30 రోజుల పబ్లిక్ నోటీసును అందజేస్తుంది. ఈ లోపు కుటుంబం కొంత రీపేమెంట్ చేస్తే తిరిగి చర్చలు జరిపేందుకు అవకాశముంటుంది. ఏదైనా అకాల మరణం తర్వాత రుణ బాధ్యతల నుంచి మీ కుటుంబాన్ని రక్షించడానికి గృహ రుణం తీసుకునేటప్పుడు హోమ్‌లోన్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.