భారత్లో కోట్ల మంది అభాగ్యులకు ఆహార, వైద్య, విద్యా సేవలు అందించే మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థలకు సంబంధించి పెను దుమారం కొనసాగుతోంది. కోల్ కతా కేంద్రంగా పనిచేసే మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థల బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసిందనే వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. సరిగ్గా క్రిస్మస్ పండుగ నాడే బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోవడంతో వేల మంది పేదలకు అందే సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు వెల్లడైంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్, క్రైస్తవ మిషనరీలకు విదేశీ నిధులపై కఠిన ఆంక్షలు తెచ్చిన దరిమిలా, ఉద్దేశపూర్వకంగానే మిషనరీస్ ఆఫ్ చారిటీ ఖాతాలను సీజ్ చేశారని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. మదర్ థెరిసా సంస్థల ఖాతాలా సీజ్ పై మమత తీవ్ర ఆరోపణల తర్వాత అసలీ విషయంలో ఏం జరిగిందో కేంద్ర హోం శాఖ వివరణ ఇచ్చుకుంది. వివరాలివి..
బెంగాల్ సీఎం మమత బెనర్జీ సోమవారం చేసిన ఓ ట్వీట్ తో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరింది. భారతదేశంలో మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థల అన్ని బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ నాడు కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసినట్లు విని దిగ్భ్రాంతికి గురయ్యానని మమత తెలిపారు. ఆ సంస్థల ఉద్యోగులు, చికిత్స పొందుతున్న 22 వేల మంది రోగులు ఆహారం, మందులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చట్టం అన్నిటి కన్నా గొప్పది అయినప్పటికీ, మానవతావాద కృషికి విఘాతం కలిగించరాదని దీదీ అభిప్రాయపడ్డారు. అయితే..
దీదీ ట్వీట్ తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సంబంధిత వార్తలు టీవీ చానెళ్లలో ప్రసారం అయ్యాయి. దీంతో మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీత కుమార్ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. ఖాతాల స్తంభన గురించి తమకు ఎవరూ ఏమీ చెప్పలేదని, తనకు అసలు ఏమీ తెలియదన్నారు. భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సందేశం రాలేదని, బ్యాంకు లావాదేవీలు సజావుగానే జరుగుతున్నాయని, అంతా సవ్యంగానే ఉందని సునీత తెలిపారు. కానీ..
బ్యాంక్ ఖాతాలు అంతా సవ్యంగా ఉన్నాయని మిషనరీస్ ప్రతినిధి వ్యాఖ్యానించిన కాసేపటికే కేంద్ర హోం శాఖ ఈ వివాదంపై అధికారిక ప్రకటన చేసింది. బ్యాంక్ ఖాతాల స్తంభనపై అందులో క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఖాతాలను కేంద్రం ఫ్రీజ్ చేయలేదని, మదర్ థెరిసా సంస్థనే అకౌంట్ల సీజ్ కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వారికి లేఖ రాసిందని కేంద్రం తెలిపింది. మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కు కేంద్రం నిరాకరించడం వల్లే ఇదంతా జరిగింది.
మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థలకు విదేశాల నుంచి సహాయ నిధులు వస్తుంటాయి. ఆ డబ్బుతో వారు ఇక్కడ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు. అయితే ఇందు కోసం ఏటా ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) రిజిస్ట్రేషన్’ను రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మదర్ సంస్థలు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారి ఎస్బీఐ బ్యాంక్ ఖాతాల్లో అవకతకలు ఉన్నట్లు కేంద్ర అధికారులు గుర్తించారు. ఆ లొసుగుల్ని కారణాలుగా చూపుతూ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కు కేంద్రం నిరాకరించింది. దీంతో మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏకంగా బ్యాంక్ ఖాతాలనే సీజ్ చేయండంటూ ఎస్బీఐకి లేఖ రాసినట్లు కేంద్ర హోం శాఖ వివరణ ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.