పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవును అమ్మిన తండ్రి కథ...

ప్రతీకాత్మక చిత్రం

ఓ బ్యాంకుకి వెళ్లి తన పిల్లలు ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అయ్యేందుకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని.. అందుకు రూ.6వేలు అప్పు కావాలని కోరాడు.

 • Share this:
  కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలు తెరుచుకోలేదు. అయినా కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని ప్రభుత్వాలు చెబుతున్నా కూడా తమ ధోరణిలో తాము వెళ్లిపోతున్నాయి స్కూళ్ల యాజమాన్యాలు. ఈ ఆన్ లైన్ క్లాసుల వల్ల వచ్చే సమస్యల గురించి ఎన్ని చెప్పినా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నచందంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని విద్యాసంస్థలు. అలాంటి విద్యాసంస్థల వల్ల ఓ తండ్రి ఎంత నష్టపోయాడో తెలుసుకుందాం.

  హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి అనే ఊరిలో కుల్దీప్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు ఒకరు నాలుగో తరగతి, మరికొరు రెండో క్లాస్ చదువుతున్నారు. ఆ పిల్లలకు వారి స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి ఏదో అత్యవసరం కోసం వాడుకోవడానికి ఫోన్ ఉంది కానీ, స్మార్ట్ ఫోన్ మాత్రం లేదు. ఓ వైపు స్కూల్ యాజమాన్యం మాత్రం ‘మీ వాళ్లకి స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఆన్ లైన్ క్లాసులు అర్థం చేసుకోగలరు. ఆ తర్వాత చదువులో వెనుకబడితే మాకు సంబంధం లేదు’ అని తెగేసి చెప్పారు.

  పిల్లల చదువుల కోసం ఏం చేయాలో పాలుపోని ఆ తండ్రి.. స్థానికంగా ఓ బ్యాంకుకి వెళ్లి తన పిల్లలు ఆన్ లైన్ క్లాసులు అటెండ్ అయ్యేందుకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని.. అందుకు రూ.6వేలు అప్పు కావాలని కోరాడు. అతని వాలకం చూసి ఆ బ్యాంకు వాళ్లు పొమ్మన్నారు. చివరకు ఏం చేయాలో తెలీక.. తన కుటుంబానికి జీవనాధారం అయిన ఆవును అమ్మకానికి పెట్టాడు. అతడి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న వారు తక్కువ డబ్బులిచ్చి కొనుక్కున్నారు. ఆ వచ్చిన డబ్బుల్లో రూ.6వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు ఆ తండ్రి.

  జ్వాలాముఖి గ్రామంలో అతడు తన కుటుంబంతో కలసి ఓ పూరిగుడిసెలో నివసిస్తున్నాడు. తనకు కనీసం రేషన్ కార్డు కూడా లేదని తెలిపాడు. తనకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా పంచాయతీలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పాడు. ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే వెంటనే అతనికి సాయం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: