Home /News /trending /

HERES HOW GYNAECOLOGIST DR SHAILAJA V SUCCESSFULLY DELIVERED A BABY BOY ONBOARD AN INDIGO FLIGHT SU GH

విమానంలో ప్రసవం.. వైద్యురాలి సేవలు అమోఘం

విమానంలో ప్రసవం

విమానంలో ప్రసవం

గైనకాలజిస్ట్‌గా ఎంతో అనుభవం ఉన్న ఒక వైద్యురాలు, తన కెరీర్లో ఎంతో మంది గర్భిణులకు డెలివరీ చేసింది. దశాబ్ద కాలంలో ఎన్నో ఆపరేషన్లు చేసింది. ఈసారి అనుకోకుండా ఒక విమానంలో డెలివరీ చేసే అవకాశం ఆమెకు వచ్చింది.

  గైనకాలజిస్ట్‌గా ఎంతో అనుభవం ఉన్న ఒక వైద్యురాలు, తన కెరీర్లో ఎంతో మంది గర్భిణులకు డెలివరీ చేసింది. దశాబ్ద కాలంలో ఎన్నో ఆపరేషన్లు చేసింది. ఈసారి అనుకోకుండా ఒక విమానంలో డెలివరీ చేసే అవకాశం ఆమెకు వచ్చింది. ఆ డాక్టర్ పేరు శైలజ. విమానంలో ప్రయాణిస్తుండగా, తోటి ప్రయాణికురాలికి పురిటి నొప్పులు రావడంతో మార్గం మధ్యలోనే ఆ గర్భిణికి డెలివరీ చేసిందామె. వైద్య సామగ్రి అందుబాటులో లేకపోయినా, సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడింది.

  విమానంలో నొప్పులు
  బుధవారం దిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో 6 ఇ 122 విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న మోనిక అనే ప్రయాణికురాలు, తనకు అసౌకర్యంగా ఉందని సిబ్బందికి తెలిపింది. విమానం టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే ఆమెకు అనుకోకుండా కడుపు నొప్పి వచ్చింది. దీంతో ప్రయాణికుల్లో ఉన్న ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ నాగరాజ్ ఆమెకు కొన్ని రకాల మందులు ఇచ్చాడు. అయినా నొప్పులు ఎక్కువ అవుతుండడంతో మోనికా రెస్ట్ రూమ్ వైపు వెళ్లింది. ఆమెకు రక్తస్రావం అయ్యింది. దీన్ని గుర్తించిన డాక్టర్ శైలజ క్యాబిన్ సిబ్బందిని అప్రమత్తం చేసి రెస్ట్రూమ్ వైపు పరుగెత్తింది.

   పీపీఈ కిట్లు ధరించి ప్రసవం చేసింది
  తాను గర్భం దాల్చి ఒకటిన్నర నెలలే అవుతోందని మోనిక శైలజకు చెప్పింది. కానీ ఆమె కనీసం 32 వారాల గర్భిణి అని శైలజ నిర్ధారణకు వచ్చింది. ఆమెకు వచ్చేది సాధారణ నొప్పులు కావని, ప్రసవ నొప్పులని డాక్టర్ గుర్తించింది. "ఆమెకు డెలివరీ పెయిన్స్ వస్తున్నాయని నాకు అర్థమైంది. దీంతో శానిటైజేషన్ చేసుకొని, పీపీఈ కిట్లు ధరించి డెలివరీ ప్రక్రియను ప్రారంభించాను. మోనికను టాయిలెట్ సీటుపై కూర్చోబెట్టాను. శిశువు తల బయటకు వచ్చాక, ఆమె పొత్తికడుపును నొక్కుతూ డెలివరీ చేశాను. నెలలు నిండకముందే పుట్టిన ఆ మగ శిశువు సుమారు 1.82 కిలోల బరువు ఉంది" అని చెబుతున్నారు డాక్టర్ శైలజ.

  సామగ్రి లేక ఇబ్బందులు
  డెలివరీ తరువాత నవజాత శిశువు, తల్లి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించాలో వారికి తెలియలేదు. దీంతో డైపర్లు, దుస్తులు, శానిటరీ న్యాప్కిన్లు, శాలువలు వంటివాటిని తీసుకురావడానికి శైలజ ప్రయత్నించింది. "తల్లికి రక్తస్రావం జరుగుతోంది. శుభ్రం చేయడానికి మాకు దుస్తులు అవసరమయ్యాయి. దీంతో పాటు తల్లి, బిడ్డలను కప్పి ఉంచడానికి శాలువలను ఉపయోగించాం. తల్లికి అడ్డంగా మూడు సీట్ల వరుసలో బ్యాగులను పెట్టాం" అని వివరిస్తున్నారు శైలజ. ఇదంతా బుధవారం సాయంత్రం 6.10 గంటలకు జరిగింది.

   జాగ్రత్తలు తీసుకున్నారు
  నెలలు నిండకముందే పుట్టిన శిశువు కావడంతో, జాగ్రత్తలు, సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఆ సమయంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో బిడ్డను దుస్తుల్లో చుట్టి, కంగారూ పద్ధతి వంటి సాంప్రదాయ మార్గాలను శైలజ ప్రయత్నించారు. ఒక ఇంక్యుబేటర్ వంటి వాతావరణాన్ని సృష్టించారు. కంగారూ సంరక్షణలో శిశువును తల్లిపై పడుకోబెడతారు. తల్లి నుంచి వేడి శిశువుకు ప్రసరిస్తుంది. సాధారణంగా ప్రీ మెచూర్డ్ బేబీల సంరక్షణకు ఆసుపత్రిలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

  ఇంతకు ఎవరీమె?
  డాక్టర్ శైలజ బెంగళూరులోని లోటస్ డయాగ్నొస్టిక్ సెంటర్ అండ్ క్లౌడ్నైన్ ఆసుపత్రిలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఇలాంటి అవకాశం రావడం అదృష్టమని ఆమె చెబుతున్నారు. అందుబాటులో ఉన్న వస్తువులతో, సిబ్బంది, తోటి వైద్యుడు నాగరాజ్ సాయంతో ఇదంతా చేయగలిగామని ఆమె పేర్కొన్నారు. కరోనా కారణంగా విమానాల్లో గ్లవుజులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. మోనికకు ప్రసవం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. అన్ని విమానాల్లోనూ ప్రసూతి వైద్యానికి కావాల్సిన సామగ్రి అందుబాటులో ఉండాలని ఈ సంఘటన సూచిస్తోంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు క్యాబిన్ సిబ్బందికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని శైలజ పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ వెల్లడించింది.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: IndiGo

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు