మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని చాలామంది అంటుంటారు. అలాంటిది ఆకాశం నుంచి మద్యం తీసుకొస్తే.. దాని ధర ఎంత ఉంటుందో ఊహించగలమా? మద్యం తాగితే ఎంత కిక్ వస్తుందో తెలియదు కానీ, ఈ మద్యం సీసా ధర వింటే మాత్రం మత్తు దిగిపోతుంది. ఎందుకంటే ఒక ఫుల్ బాటిల్ వైన్ ధరను అక్షరాలా రూ.7.4 కోట్లుగా నిర్ణయించింది ఒక సంస్థ. మన దేశంలో లభించే కాస్ట్లీ వైన్ ఫుల్ బాటిల్ ధర రూ.10,000 వరకు ఉంటుందేమో. బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే అత్యుత్తమమైన వైన్ బాటిల్ అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. అయితే ప్రస్తుతం చెబుతున్న వైన్ బాటిల్ ధర ఏకంగా రూ.7 కోట్లకు మించి ఉండటం విశేషం. ‘పెట్రస్ 2000’ అనే ఈ ఫ్రెంచ్ వైన్‌ను అంతరిక్షంలో పులియబెట్టారు. అందుకే దానికి అంత ధరను నిర్దేశించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఏడాదికిపైగా ఉంచిన ఈ వైన్ బాటిల్‌ను క్రిస్టీస్ అనే సంస్థ వేలానికి పెట్టింది. దీనికి 10 లక్షల డాలర్ల వరకు ధర పలకొచ్చని అంచనా వేస్తున్నారు. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.7.4 కోట్లకు సమానం. పెట్రస్ 2000 బాటిల్‌ను వేలంలో కొనుక్కున్నాక ఎప్పుడు తాగాలన్నది యజమాని ఇష్టం. అయితే ఇప్పటికిప్పుడు తాగే కన్నా కొన్నాళ్ల తర్వాత తాగితేనే దీని రుచి ఇంకా బాగుంటుందని వేలం నిర్వాహకులు అంటున్నారు. ఈ వైన్ ఇంకా 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఇలానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎప్పుడు పంపించారు...
భూమి వెలుపల సేద్యానికి అవకాశాలపై చేస్తున్న పరిశోధనలో భాగంగా.. స్పేస్ కార్గో అన్లిమిటెడ్ అనే సంస్థ 2019 నవంబరులో అంతరిక్షంలోకి 12 వైన్ సీసాలు పంపింది. 14 నెలల తర్వాత తాజాగా వాటిని భూమికి రప్పించింది. ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ వైన్ అండ్ వైన్ రీసెర్చ్‌లో ఆ వైన్‌కు రుచి పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు భూమిపై అంతేకాలం పులియబెట్టిన వైన్‌తో కూడా దీన్ని పోల్చి చూశారు. రుచిలో రెండింటి మధ్య తేడా ఉందని వారు గుర్తించారు. పెట్రస్ 2000లోని పానీయం మృదువుగా, సువాసనభరితంగా ఉందని శాస్త్రవేత్తలు గమనించారు. అందుకే ఈ మద్యం ధర బాగా పెరిగిపోయింది. కోట్లు పలుకుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Life Style, Space, Wine