సాధారణంగా పెద్ద వ్యక్తులు ఎవరికైనా లేఖలు రాస్తే దాన్ని చాలా మంది భద్రంగా దాచి పెట్టుకుంటూ ఉంటారు. అలా ఐన్ స్టీన్, మహాత్మా గాంధీ లాంటి వారు రాసిన కొన్ని లేఖలను వేలం వేస్తే.. వాటికి రూ.కోట్లు లభించిన సంఘటనలు కూడా మనం చూశాం. తాజాగా అలా మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లేఖను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. కొన్ని గంటల్లోనే ఇది వైరల్గా మారింది. ఇంతకీ ఈ లేఖను ఆమె ఎవరికి రాశారు? అందులో ఏముంది? వివరాల్లోకి వెళ్తే..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లేఖలు రాయడంపై ఆసక్తి చూపించేవారు. ఆమె ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1973 జులై 5న టాటా గ్రూప్ అధినేత జే ఆర్ డీ టాటాకి రాసిన ఓ లేఖను తాజాగా హర్ష్ గోయెంకా షేర్ చేశారు. దీన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ‘అప్పటి ప్రధాన మంత్రి ఓ అతి పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి రాసిన ఓ పర్సనల్ లెటర్.. ఎంత క్లాసీగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు.
ఈ లేఖలో ఇందిరా గాంధీ తనకు అందిన పెర్ఫ్యూమ్ల గురించి రాసుకొచ్చారు. ‘నాకు అందిన పెర్ఫ్యూమ్లను చూసి నేను చాలా ఆనందంగా ఫీలయ్యాను. వీటిని పంపినందుకు మీకు ధన్యవాదాలు. నేను సాధారణంగా పెర్ఫ్యూమ్లు ఎక్కువగా ఉపయోగించను. ఇలాంటివి ఉంటాయన్న విషయమే నాకు తెలియదు. కానీ ఇకపై వీటిని తప్పక ప్రయత్నిస్తాను’ అని ఇందిరా గాంధీ ఈ లేఖ ప్రారంభంలో వెల్లడించారు.
‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఏదైనా విషయం గురించి చర్చించాలి లేదా మీ అభిప్రాయాలను చెప్పాలి అనుకున్నప్పుడు ఓ లేఖ రాయండి. లేదా నేరుగా వచ్చి నన్ను కలవండి. అవి ఎలాంటి అభిప్రాయాలైనా చెప్పడానికి వెనుకాడకండి. మీకు, థెల్లీ (థెల్మా టాటా, జేఆర్డీ టాటా భార్య)కు శుభాకాంక్షలు చెబుతూ.. మీ ఇందిరా గాంధీ’ అంటూ ఈ లేఖను ఆమె పూర్తి చేశారు.
A very personal letter exchange between a powerful Prime Minister and a giant industrialist. Sheer class ! #Tata pic.twitter.com/RqDKEcSsBf
— Harsh Goenka (@hvgoenka) July 20, 2021
ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే వ్యాపారవేత్తలలో హర్ష్ గోయెంకా ఒకరు. నిత్య జీవిత విషయాల నుంచి ఇలాంటి పాత సంగతుల వరకు ప్రతి ఒక్కటి ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఇలాంటి లేఖలను మిస్సవుతున్నామని, ఇలాంటి అద్భుతమైన రత్నాలను ఒకటి తర్వాత ఒకటి గోయెంకా బయటకు తీస్తున్నారని కొందరు ప్రశంసలు కురిపించారు.
‘జేఆర్ డీ టాటా కూడా అద్భుతంగా లేఖలు రాసేవారు. చేతి రాతతో లేఖలు రాసి అందరికీ పంపేవారు. కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, కొలీగ్స్, అప్పటి రాజకీయ నాయకులైన నెహ్రూ, ఇందిరా గాంధీ లాంటి వారికి ఇలాంటి లేఖలు రాసేవారు’ అంటూ టాటా రాసిన ఓ లేఖను పంచుకున్నారు ఓ యూజర్. ఇందిరా గాంధీ చాలా గొప్ప లీడర్. బిర్లాలు, టాటాలు, గోయెంకా లాంటి వాళ్లు ప్రపంచానికే గర్వ కారణం.. అని ఓ యూజర్ రాశారు. ఇలాంటి టైప్ రైటర్ తో రాసిన లేఖలను మిస్సవుతున్నామని, అందులో ఓ రకమైన పర్సనల్ టచ్ ఉంటుందని చెబుతూ ఆదిత్య వి బిర్లా రాసిన ఓ లేఖను షేర్ చేశారు మరో యూజర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indira Gandhi, National News, Twitter, VIRAL NEWS