టిక్ టాకర్లూ.. ట్రెండ్ సంగతి తరువాత. ముందు పళ్లు ఊడగొట్టుకోకండి. అంటూ దంత వైద్యులు పదేపదే హెచ్చరించాల్సిన పరిస్థితి దాపురుంచింది. అదేమంటే ఓవైపు టిక్ టాక్ (tiktok) సందడి మరోవైపు హాలోవీన్ (Halloween)సందడి. ఇంకేముంది జాంబీల్లా (Zombie)కనిపించేందుకు, దుష్టశక్తుల్లా జీవించేందుకు ప్రజలు తెగ పోటీపడుతున్నారు. సరదాగా ఈ పండుగ చేసుకుంటే తప్పులేదు కానీ ఇందుకోసం ఒంట్లోని అవయవాలకే ఎసరు పెట్టుకుంటే ఎలా?
హాలోవీన్ కోసం ఏమైనా!
హాలోవీన్ సీజన్ నడుస్తోంది కాబట్టి టిక్ టాక్ లోనూ ఇదే ట్రెండింగ్ గా (Tiktok trend) ఉంది. వాంపైర్ (రక్త పిశాచి) లా కనిపించేందుకు నానా తంటాలు పడుతున్న ఔత్సాహికులు తమ పళ్లకు కృత్రిమమైన కోరలు పెట్టుకుంటున్నారు. మార్కెట్లో పెద్ద ఎత్తున లభిస్తున్న ఈ కృత్రిమ కోరల సెట్టు పెట్టుకునేందుకు పళ్లపై జిగురు రాయాల్సిందే. ఇలా జిగురు రాసిన దంతాలపై కోరల చట్రం పెట్టుకుంటే అది అలాగే అతుక్కుపోతుంది. కానీ, ఆ తర్వాత డెంటిస్ట్ దగ్గరికి పరిగెత్తాల్సిందే. ఇలా హాలోవీన్ కోసం ఎంతకైనా తెగిస్తే ఊడేది మీ పళ్లేగా.
వైరల్ వీడియోలు
సోషల్ మీడియాలో అంతా హాలోవీన్ హంగామానే కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో తమ కోరలను సకిలిస్తూ నెటిజన్లు అప్ లోడ్ చేస్తున్న వీడియోలు ఓవైపు వైరల్ అవుతుండగా మరోవైపు ఇలా చేసినందుకు తమకు ఏం గతి పట్టిందో చూపుతూ చేసిన వీడియోలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. ఈ రెండు వీడియాలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతుండగా ఇది చూసినవారు ఆలోచనలో పడుతున్నారు.
నెయిల్ పాలిష్ చాలా డేంజర్ గురూ
కొందరు టిక్ టాకర్లు తమ మొదటి వీడియోలో దంతాలకు కోరలు పెట్టుకోవడం , దాంతో భయపెట్టి మార్కులు కొట్టేసినట్టు చూపారు. ఇక వీరు రూపొందించిన రెండవ వీడియోలో కోరలు ఊడిరాకపోవడంతో డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సి రావడం, డాక్టర్లు పళ్లు పీకడం కూడా చూపారు. ఇక నెయిల్ పాలిష్ షైనర్లు దంతాలపై పూస్తే దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతిని, మీరు జీవితాంతం దంత సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. పైపెచ్చు నెయిల్ పాలిష్ షైనర్లు చాలా విషపూరితమైనవి. ఎన్నో రసాయనాలతో తయారైన దీన్ని నోట్లో పూసుకుంటే ఎంత ప్రమాదం అన్న సంగతి కూడా ఆలోచించకపోతే ఎలా?
ఫోటో యాప్
నెయిల్ గ్లూ, సూపర్ గ్లూ వంటివాటికి హాలోవీన్ టైంలో విపరీతమైన డిమాండ్ వచ్చిపడింది. హాలోవీన్ ను కొన్ని రోజులపాటు జరుపుకునే క్రమంలో భయంకరమైన రూపాల్లో కనిపించేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. ఇదంతా కెమెరాల కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో క్రేజీగా ఏం చేసినా అది నెట్ లో వైరల్ కావాల్సిందే. ఈ ఫోటో యాప్ (photo app) మోజులో పడి ఇన్ని తంటాలు కొనితెచ్చుకుంటున్నారు. మీరు, మీ పిల్లలు హాలోవీన్ జరుపుకుంటున్నట్టయితే ఇలా ప్రమాదాలు మాత్రం రాకుండా జాగ్రత్తపడండి.
మనదేశంలో పుంజుకుంది
ఇటీవలి కాలంలో హాలోవీన్ పండుగ మనదేశంలో (Halloween in India) గతంలో ఎన్నడూ లేనంతగా పుంజుకుంది. సోషల్ మీడియా ప్రభావంతో, సెలబ్రిటీలను చూసి కాపీ కొడుతున్న సామాన్యులు హాలోవీన్ అంటూ రీసార్టులకు వెళ్లడం, థీమ్ పార్కులకు వెళ్లడం, హాలోవీన్ పార్టీలు జరుపుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇది తమ పిల్లలకు సంతోషాన్నిస్తుందనే క్రమంలో పెద్దలు కూడా హాలోవీన్ వచ్చిందంటే చాలు ఎంత ఖర్చైనా వెచ్చించి ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారుతోంది. పాశ్చాత్య సంస్కృతిని ఇష్టపడుతున్న యువతీ యువకులు హాలోవీన్ కోసం మనదేశంలోని చిన్న పట్టణాల్లో కూడా ఎంతో సందడి చేసేస్తున్నారు. దీన్నంతా సోషల్ మీడియాలో పంచుకుని రెట్టింపు ఆనందాన్ని పొందుతున్నారు. కానీ హాలోవీన్ కోసం పడుతున్న పాట్ల పర్యవసానంగా ఇలా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాల్సివస్తోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiktok, VIRAL NEWS