ప్లేట్ 25 పైసల నుంచి రూ.150 వరకు.. హలీం ప్రయాణం!

హైదరాబాదీల మనసు దోచిన వంటకంగా హలీం ముద్రవేసుకుంది. ఓ రకంగా హలీం అంటే రంజాన్...రంజాన్ అంటే హలీం అన్నంతగా మారిపోయింది.

Ashok Kumar Bonepalli | news18-telugu
Updated: June 15, 2018, 6:02 PM IST
ప్లేట్ 25 పైసల నుంచి రూ.150 వరకు.. హలీం ప్రయాణం!
హైదరాబాద్‌లోని ఓ హలీం కౌంటర్
Ashok Kumar Bonepalli | news18-telugu
Updated: June 15, 2018, 6:02 PM IST
ఈ ఏడాది హలీం తిన్నావా? లేదా..!? రంజాన్ మాసంలో హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ ఒకరినొకరు తప్పనిసరిగా అడిగే ప్రశ్న ఇది. మతంతో సంబంధం లేకుండా నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరూ హలీం రుచికి సలాం కొట్టాల్సిందే. అతిథిలా వచ్చి.. భాగ్యనగరవాసుల జీవితంలో భాగమైపోయింది ఈ ఇరానీ వంటకం. రంజాన్ అంటే హలీం.. హలీం అంటే రంజాన్ అన్న చందంగా మారింది. ఏడాదికి ఓసారి నెల రోజుల పాటు జిహ్వ చాపల్యాన్ని తీరుస్తుంది.

హలీం అనేది ఇరానీ వంటకం. హైదరాబాద్ ఆరో నిజాం నవాబు మహబూబ్‌ అలీఖాన్‌ వంటశాలలో ప్రత్యేక డిష్‌గా హలీం తయారుచేసేవారు. ఇరాన్ నుంచి వచ్చిన వంటమనుషులు దీన్ని వండేవారు. అప్పట్లో కేవలం నవాబులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంపన్నులకు మాత్రమే హలీం రుచి తెలిసేది. ఆ తర్వాత కొన్నాళ్లకు సామాన్యుల చెంతకు కూడా చేరింది. రంజాన్ మాసంలో సంపన్నులు హలీం తయారు చేయించి పేదలకు పంచేవారు. అయితే, హలీంను సగటు హైదరాబాదీల చెంతకు చేర్చింది మాత్రం ఓల్డ్ సిటీలోని మదీనా దగ్గర ఓ హోటల్ యజమాని. 
1947లో రంజాన్ మాసం తొలిరోజు.. ఈ హలీంను తయారు చేసి 25 పైసలకు ఓ కప్పు చొప్పున అమ్మాడు.  అయితే, అంతగా ప్రజాదరణ పొందలేదు. కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా హలీంకు ప్రచారం కల్పించాడు. పోస్టుకార్డులు, పత్రికల్లో హలీం గురించి విపరీతంగా ప్రచారం చేయించాడు. అంతే..! హలీం తినకపోతే ఇక పండుగ చేసుకోనట్టే అనేంత స్థాయిలో జనం క్యూ కట్టారు.


1956 తర్వాత హలీంకు ప్రచారం బాగా పెరిగింది. 1998లో ఆ హోటల్ యజమాని చనిపోయాడు. అనంతరం ఇతర హోటళ్లు ఈ హలీం తయారీలో దూసుకొచ్చేశాయి. హైదరాబాదీల మనసుదోచిన ఇరానీ వంటకం.. నవాబుల నగరం నుంచి మళ్లీ అరబ్ దేశాల బాట పట్టింది. సింగపూర్‌, అమెరికా, ఆస్ట్రేలియా, మస్కట్‌, రియాద్‌, జడ్డా లాంటి దేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ అవుతోంది. నాన్ వెజ్ ప్రియుల మనసు గెలిచిన వంటకం.. వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.
గత ఏడాది పవిత్ర రంజాన్ మాసంలో సుమారు రూ.450 కోట్ల హలీం వ్యాపారం జరిగినట్టు అంచనా. ఈ సంవత్సరం అంతకు రెట్టింపు వ్యాపారం జరిగిందని లెక్కలు వేస్తున్నారు.


ఔను.. ఇంతకీ మీరు హలీం తిన్నారా..!?
First published: June 15, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...