Home /News /trending /

GUJARAT COVID HIT CA BEATS CYTOKINE STORMS LUNG RUPTURES MK GH

Covid-19 Survivor: కరోనా నుంచి 5 నెలల తర్వాత కోలుకున్న యువకుడు...వైద్యచరిత్రలో అద్భుతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొవిడ్‌ బారిన పడితే కోలుకోవడం కష్టమనే భయం అనేక మందిలో నెలకొంది. కానీ కరోనా కష్టాలన్నింటినీ అధిగమించి అజేయుడిగా నిలిచారు రాజస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల యువ చార్టెడ్‌ అకౌంటెంట్‌ నమన్‌ మహేశ్వరి. నమన్‌ కరోనా నుంచి కోలుకోవడం నిజంగా ఒక అద్భుతంగా చెప్పాలి.

ఇంకా చదవండి ...
కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలెన్నో మనం చూశాం. కొవిడ్‌ బారిన పడితే కోలుకోవడం కష్టమనే భయం అనేక మందిలో నెలకొంది. కానీ కరోనా కష్టాలన్నింటినీ అధిగమించి అజేయుడిగా నిలిచారు రాజస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల యువ చార్టెడ్‌ అకౌంటెంట్‌ నమన్‌ మహేశ్వరి. నమన్‌ కరోనా నుంచి కోలుకోవడం నిజంగా ఒక అద్భుతంగా చెప్పాలి. ఆయన కోలుకున్న తీరు కరోనా చికిత్సలో ఒక కేస్‌స్టడీగా నిలవడం ఖాయం. మరణం అంచు వరకు వెళ్లి వచ్చారు నమన్‌. ఏప్రిల్‌ 23న సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది. ఆ వెంటనే శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో అతడిని ఉదయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఏప్రిల్‌ 28న అహ్మదాబాద్‌లోని ఎపిక్‌ ఆస్పత్రికి తరలించారు.

అప్పటి నుంచి నమన్ ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఏకంగా ఐదు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈ సమయంలో కొవిడ్‌కు సంబంధించిన ప్రతి సమస్యను నమన్‌ ఎదుర్కొన్నాడు. అయినా కూడా చివరకు పూర్తిగా కోలుకోవడం విశేషం. అద్భుతమైన పోరాటపటిమ, దృఢసంకల్పం నమన్‌ను కోలుకునేలా చేశాయి. అతి త్వరలోనే అతడిని డిశ్చార్జ్‌ చేస్తామని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

మే నెలలో నమన్‌ సైటోకిన్‌ దాడి ప్రభావాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతనికి టొసిలిజుమూబ్‌ మెడిసిన్ అందించారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఎన్నో ఫంగల్‌, బ్యాక్టరీయా ఇన్‌ఫెక్షన్ల బారిన పడ్డాడు నమన్‌. అతని ఊపిరితిత్తులకు మూడుసార్లు రంధ్రాలు పడ్డాయి. తీవ్రంగా ప్రభావితమైన ఊపిరితిత్తుల నుంచి కొంత భాగాన్ని ల్యాపరోస్కోపిక్‌ సర్జరీ ద్వారా తొలగించారు కూడా. ఆగస్టులో గుయిలియాన్‌-బారె సిండ్రోమ్‌ (జీబీఎస్‌) బారిన పడటంతో అతని రోగనిరోధక వ్యవస్థ చచ్చుపడిపోయింది, దీంతో కండరాలన్నీ బలహీనంగా మారిపోయాయి.

దాదాపు నాలుగు నెలలు ఐసీయూలో గడిపారు నమన్‌. అందులో మూడు నెలలు పూర్తిగా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఏమీ తినలేని పరిస్థితి. దీంతో గొంతులో ఒక ట్యూబ్‌ అమర్చి ద్రవాహారం అందించారు. ఇప్పటికీ అతనికి ఆక్సిజన్‌ అవసరమే అయినా కాస్త అటు ఇటు నడవగలుగుతున్నాడు. నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాడు. కొద్ది సేపు మాట్లాడగలుగుతున్నాడు. నమన్‌ కోలుకోవడం వెనుక ఆయన దృఢసంకల్పంతో పాటు కుటుంబసభ్యుల బలమైన మద్దతుకూడా ఉందని ఎపిక్‌ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

ఆస్పత్రిలో నమన్‌ను అతని తల్లి సునీత కంటికి రెప్పలా కాపాడుకుంది. తన పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉంటుందని ముందే ఊహించాను అంటారు నమన్‌. డాక్టర్లు, దేవుడిపై తనకు విశ్వాసం ఉందని, ఏప్రిల్‌ నుంచి తన తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పాడు.

ఎన్నో సమస్యలు, వైద్యపరంగా ఎన్నో ఆరోగ్యపరమైన ప్రక్రియలు ఎదుర్కొన్న నమన్‌ అందరికి ఇస్తున్న సలహా ఒక్కటే. అదేంటంటే.. ‘కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు కాకపోయినా మరికొన్నాళ్ల తర్వాత అయినా అది ఏదో రూపంలో తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తుంది. అందువల్ల పరిశుభ్రత చర్యలు పాటించండి. మరికొన్నాళ్లు సంయమనంతో వ్యవహరించండి’ అని సూచిస్తున్నాడు.
Published by:Krishna Adithya
First published:

Tags: Covid -19 pandemic

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు