టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ గ్రైమ్స్ రూ.42 కోట్ల ఆర్ట్ వర్క్ ను వేలం ద్వారా సేల్ చేశారు. తాను వేసిన పెయింటింగ్ కు “WarNymph”అని పేరుపెట్టిన గ్రైమ్స్ స్వతహాగా సింగర్ కూడా. మార్స్ ను ఓ బేబీ కాపాడుతున్నట్టు ఉన్న ఈ డిజిటల్ ఇమేజ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తన డిజిటల్ ఆర్ట్ వర్క్ ను గ్రైమ్స్ వేలం వేయగా మిలియన్ల డాలర్లు ఆమె చేజిక్కించుకున్నారు. అయితే ఆమె తన ఆర్ట్ వర్క్ ను క్రిప్టో కరెన్సీలో అమ్మటం మరో హైలైట్. ట్విట్టర్లో తమ ఆర్ట్ వర్క్ ను వేలానికి పెడుతున్నట్టు గ్రైమ్స్ ట్వీట్ చేయగా 20 నిమిషాల్లో ఆమె వేసిన కళాఖండం 5.8మిలియన్ డాలర్లకు హాట్ కేక్ లా అమ్ముడైపోయింది. క్రిప్టో ఆర్ట్ మార్కెట్ విలువ వంద మిలియన్ డాలర్ల పైమాటే. కాగా ఈ డిజిటల్ పెయింటింగ్ లో ఉన్నది ఎలాన్ మస్క్, గ్రైమ్స్ కు కలిగిన సంతానమే అన్న విషయం ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిక్చర్ లోని బేబీ ఎలాన్ మస్క్ సంతానాన్ని పోలి ఉండటమే దీనికి కారణం. నిఫ్టీ గేట్వే అనే ఎన్ఎఫ్టీ ప్లాట్ ఫారంలో గ్రైమ్స్ తన ఆర్ట్ పీసులను అమ్ముతున్నారు. గత కొంతకాలంగా దీన్ని సింగర్ అయిన తన సోదరుడితో కలిసి ఆమె నిర్వహిస్తున్నారు.
డెత్ ఆఫ్ ద ఓల్డ్ - $400,000
క్రిప్టో కరెన్సీలో వచ్చిన కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థ అయిన కార్బన్ 180కి విరాళంగా ఇవ్వనున్నట్టు గ్రైమ్స్ ఇప్పటికే వెల్లడించారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేస్తున్న ఈ సంస్థకు ఆమె విరాళమిస్తుండటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు తాను ఇలాంటి ఎన్నో ఆర్ట్ వర్క్స్ ను వేలం కోసం పెట్టనున్నట్టు, "మిథికల్ యూనివర్స్" అనే మరో పెయింటింగ్ ఇప్పటికే సిద్ధంగా ఉందని గ్రైమ్స్ వివరిస్తున్నారు. ఇక "డెత్ ఆఫ్ ద ఓల్డ్" అనే మరో ఆర్ట్ పీస్ ను గ్రైమ్స్ సుమారు 400,000 డాలర్లకు విక్రయించారు. ఎన్ఎఫ్టీ ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తున్న వారిలో ఈమె కూడా ఒకరు కావటం విశేషం. న్యాన్ క్యాట్ అనే ఓ డిజిటల్ పెయిటింగ్ ను కామిక్ ఆర్టిస్ట్ ఒకరు 600,000 డాలర్లకు ఇటీవలే ఈ ప్లాట్ ఫాం ద్వారా విక్రయించారు. బిలియనీర్ ఇన్వెస్టర్లు కొందరు ఇలాంటి వాటిని ఆసక్తిగా కొంటున్నారు. లిండ్సే లోహన్ కూడా ఎన్ఎఫ్టీ ప్లాట్ ఫాంపై 59,000 డాలర్లకు విక్రయించారు. సెలబ్రిటీలు ఎంతోమంది ఇలా non-fungible token (NFT) ద్వారా బిట్ కాయిన్ ఆర్జిస్తున్నారు. సెలబ్రిటీలు సేల్ కు పెట్టే వస్తువులను క్రేజీ ఫ్యాన్స్ సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్నారు.
ట్రాన్సాక్షన్స్ కోసం ..
ఇటీవలి కాలంలో క్రిప్టో ఆర్ట్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీని ఉపయోగించి అద్భుతమైన చిత్రరాజాలను సొంతం చేసుకునే ఛాన్సులు పెరుగుతున్నాయి. మరోవైపు క్రిప్టో కరెన్సీని ఉపయోగించి ఏవైనా కొనుగోలు చేసేందుకు పెద్దగా అవకాశాలు లేవు. ఇప్పుడిప్పుడే టెస్లా వంటి కంపెనీలు ఈమేరకు చొరవ తీసుకుంటున్నాయి. తమ కంపెనీ తయారు చేసే హై ఎండ్ కార్లను కొనాలనుకునేవారు క్రిప్టో కరెన్సీ ద్వారా కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. దీంతో క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.