ఆఫీసు నుంచి 2 నిమిషాలు త్వరగా ఇంటికి వెళ్లిందని జీతంలో కోత.. ఎక్కడ, ఎంత?

ప్రతీకాత్మక చిత్రం

2018లో కోబే నగరంలో వాటర్ వర్క్ బ్యూరోకు చెందిన 64 ఏళ్ల ఉద్యోగి మూడు నిమిషాల ముందే లంచ్ బ్రేక్ తీసుకున్నాడనే కారణంగా అతడిని మందలించడమే కాకుండా జరిమానా విధించారు.

  • Share this:
ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి కాస్త ముందుగా ఇంటికి వెళ్లాలన్నా కుదరని ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగులవి.. ఉదయం ఆలస్యమైతే కొన్ని ఆఫీసుల్లో పర్మిషన్ ఇచ్చినా.. మరికొన్ని చోట్ల జీతం కట్ చేస్తారు. అదే ప్రభుత్వోద్యోగులకు మాత్రం కాస్త స్వేచ్ఛ ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది ప్రభుత్వోద్యోగులు ఉదయం సమయానికి ఆఫీసుకు రారు. సాయంత్రం వీలైనంత తొందరగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే అందరూ అలాగే ఉండరనుకోండి. ఇది కొందరి విషయంలో మాత్రమే వర్తిస్తుంది. మన దగ్గర పనికి ఆలస్యంగా రావడం, సాయంత్రం తొందరగా వెళ్లడం వంటివి పెద్దగా పట్టించుకోరు కానీ ఇతర దేశాల్లో మాత్రం ఇది చాలా పెద్ద విషయంగా చూస్తారు. కొన్ని దేశాల్లో అయితే నిర్దేశించిన సమయం కంటే ముందుగా కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తే జీతంలో కోత విధిస్తారు. అవును ఈ ఇలాంటి ఘటనే జపాన్ లో జరిగింది. ఆఫీసు నుంచి రెండు నిమిషాలు తొందరగా వెళ్లిందనే కారణంగా ఓ మహిళకు తన జీతంలో 10 శాతం కోత విధించింది ఆ సంస్థ.

స్థానిక వార్త కథనాల ప్రకారం జపాన్ లోని చీబా ఫునాబాషి సిటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తన ఉద్యోగి కార్యాలయం నుంచి రెండు నిమిషాలు తొందరగా ఇంటికి వెళ్లిందనే కారణంతో వేతనంలో కోత విధించింది. వివరాల్లోకి వెళ్తే.. మే 2019 నుంచి జనవరి 2021 మధ్య కాలంలో దాదాపు 316 సార్లు ఉద్యోగులు త్వరగా నిష్క్రమించారనే విషయం మేనేజ్మెంట్ దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా అన్ని సందర్భాల్లోనూ ఉద్యోగులు తమ కార్డులో తప్పుడు సమయాన్ని రాశారని యాజమాన్యం తెలుసుకుంది.

దీంతో లెఫ్లాంగ్ లెర్నింగ్ డిపార్ట్మెంటులో అసిస్టెంట్ సెక్షన్ ఛీఫ్ అయిన 59 ఏళ్ల మహిళా ఉద్యోగిపై కొరడా ఝుళిపించింది. ఇతర ఉద్యోగులు త్వరగా పని ముగించుకొని వెళ్లడానికి సహాయపడినందుకు గాను ఆమెకు శిక్షగా మూడు నెలల వరకు జీతంలో 10వ వంతు కోత విధించింది. నివేదికల ప్రకారం శిక్షకు గురైన ఈ మహిళ తన లాగ్ అవుట్ టైం 05.15PM కంటే రెండు నిమిషాల ముందే పని నుంచి నిష్క్రమిస్తుంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. సాయంత్రం 05.17 గంటలకు ఇంటికి వెళ్లే బస్సును అందుకోవడానికి ఆమె అలా చేస్తోంది. ఈమెతో పాటు మరో ఇద్దరు సిబ్బందికి యాజమాన్యం రాతపూర్వక హెచ్చరికలు జారీచేసింది. మరో నలుగురికి కఠిమైన నోటీసులు ఇచ్చింది. అధికారులు తమ ఉద్యోగులపై అసమంజసంగా, కఠినంగా వ్యవహరించిన ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో త్వరగా వైరల్ అయింది. దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చకు దారితీసింది. జపాన్ లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు. 2018లో కోబే నగరంలో వాటర్ వర్క్ బ్యూరోకు చెందిన 64 ఏళ్ల ఉద్యోగి మూడు నిమిషాల ముందే లంచ్ బ్రేక్ తీసుకున్నాడనే కారణంగా అతడిని మందలించడమే కాకుండా జరిమానా విధించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: