వినియోగదారుల అవసరాల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన గూగుల్ ఎర్త్‌ను వేరే అవసరాలకు వాడుతున్నారు నెటిజన్లు. గూగుల్ చూపించే పాత ఫోటోల్లో చనిపోయిన తమవారిని గుర్తిస్తూ, ఆ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా గూగుల్ ఎర్త్‌లో ఏడేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి ఫోటోను గుర్తించిన ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్నాడు. అతడిని చూసి చాలామంది నెటిజన్లు గూగుల్ ఎర్త్‌లో తమ ఇళ్లు, జ్ఞాపకాల కోసం వెతుక్కుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కరోనా ప్రభావంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జపాన్ ప్రజలు భయపడుతున్నారు. దీంతో ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక వ్యక్తి టైమ్ పాస్ కోసం గూగుల్ ఎర్త్‌లో తన ఇంటి కోసం వెతికాడు. దాంట్లో ఉన్న ఫోటోను చూసి అతడు షాక్ అయ్యాడు. అప్పట్లో తన తండ్రి ఇంటిముందు నిల్చొని ఉన్న ఫోటో గూగుల్ ఎర్త్‌లో కనిపించింది. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘గూగుల్ఎర్త్లో పాత ఫోటోలను అప్డేట్ చేయలేదనుకుంటా. రోడ్డుపై మా నాన్న నిల్చొని ఉన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ఏడేళ్ల క్రితమే చనిపోయారు’ అని అతడు ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు దీనికి 6.9 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ ట్వీట్ చూసిన చాలామంది ట్విట్టర్ యూజర్లు గూగుల్ ఎర్త్‌లో తమ ఊరు, ఇళ్లు కోసం వెతుక్కుంటున్నారు. గతంలో పొలాల్లో పనిచేస్తున్న తన అమ్మమ్మ ఫోటోను తాను గూగుల్ ఎర్త్‌లో చూశానని ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. గత ఏడాది ఆమె చనిపోయిన విషయాన్ని అతడు గుర్తుచేసుకున్నాడు. తన ఇంటి కోసం చూస్తున్నప్పుడు, సంవత్సరం క్రితం చనిపోయిన తమ క్కుక్క గూగుల్ ఎర్త్ ఫోటోల్లో కనిపించిందని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.
వైరల్ అయిన మరో సంఘటన
2018లో తన భార్య అక్రమ సంబంధాన్ని గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా గుర్తించి వార్తల్లో నిలిచాడు ఒక వ్యక్తి. పెరూలోని లిమా నగరంలో ఒక బ్రిడ్జి కోసం గూగుల్ స్ట్రీట్ వ్యూను పరిశీలిస్తున్న వ్యక్తికి.. తన భార్య వేరొకరితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. 2018లో ఈ సంఘటన జరిగింది. ఆ ఫోటోల్లో తన భార్య మరొక వ్యక్తిని గట్టిగా కౌగిలించుకుని ఉండటం చూసి అతడు షాక్ అయ్యాడు. తన భార్య ధరించిన దుస్తులు, వేరొక వ్యక్తి పక్కన ఆమె కూర్చున్న బెంచ్‌ను అతడు గుర్తుపట్టాడు. గట్టిగా ప్రశ్నించిన తరువాత ఎఫైర్ ఉందని ఆమె ఒప్పుకుంది. అప్పట్లో ఈ సంఘటన ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
Published by:Hasaan Kandula
First published:January 09, 2021, 18:11 IST