రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు.. మండిపడ్డ గంగూలీ..

సౌరవ్ గంగూలీ (ఫైల్)

BCCI | Cricket | ద్రవిడ్‌కు నోటీసులు అందడంపై భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. బీసీసీఐపై తనదైన శైలిలో మండిపడ్డారు.

  • Share this:
టీమిండియా ‘ద వాల్’, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని, దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు బోర్డు అంబుడ్స్‌మన్-ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ మంగళవారం నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ద్రవిడ్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉంటూనే, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ గ్రూప్‌‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉంది. దీంతో ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. దాంతో ఫిర్యాదుపై స్పందించాలని ద్రవిడ్‌కు నోటీసులు జారీ చేశారు. గతంలో క్రికెట్ సలహా కమిటీ సభ్యులుగా ఉన్న సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌పైనా గుప్తా ఫిర్యాదు చేశాడు. దాంతో వారు ఆ పదవి నుంచి తొలగాల్సి వచ్చింది.

ద్రవిడ్‌కు నోటీసులు అందడంపై భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. బీసీసీఐపై తనదైన శైలిలో మండిపడ్డారు. ‘ఇది భారత క్రికెట్‌లో కొత్త ఫ్యాషన్.. పరస్పర విరుద్ధ ప్రయోజనం.. వార్తల్లో ఉండటానికి ఇదో ఎత్తుగడ.. దేవుడే భారత క్రికెట్‌ను రక్షించాలి..’ అంటూ ట్వీట్ చేశారు. కొందరు వార్తల్లో నిలవడానికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల పేరిట ఫిర్యాదులు చేస్తుంటారని ఆరోపించారు.

Published by:Shravan Kumar Bommakanti
First published: