news18-telugu
Updated: December 1, 2020, 3:48 PM IST
ఓటర్లు లేక జీహెచ్ఎంసీ పోలింగ్ కేంద్రంలో నిద్రపోతున్న జనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలా ఉందో తెలిపేందుకు ఈ ఒక్క ఫొటోనే నిదర్శనం. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటర్లు రాక ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది ఈగలు, దోమలు తోలుకుంటున్నారు. చివరకు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత అలా ఓ కునుకు తీశారు. ఓటింగ్‌కు సంబంధించిన సరంజామా అంతా టేబుల్ మీద పెట్టి అలాగే కునుకు తీస్తున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, వారు ఉద్యోగులా? లేకపోతే అభ్యర్థుల తరఫు ఏజెంట్లా అనేది కూడా తెలియాల్సి ఉంది. వాస్తవంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లడం నిషేధం. పోలింగ్ సిబ్బందితో పాటు పార్టీల తరఫున వచ్చే పోలింగ్ ఏజెంట్లకు కూడా ఇది అమలవుతుంది. అయితే, మరి ఈ ఫొటోను ఎవరు తీశారో తెలియదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. ప్రజలు బయటకే రాలేదు. మధ్యాహ్నం 1గంట సమయానికి 18.20 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం, అత్యల్పంగా తలాబ్ చంచలం 0.74 శాతం, అమీర్ పేట్ 0.79 శాతం ఓటింగ్ నమోదైంది. డివిజన్ మొత్తం పరిస్థితి ఇలా ఉంటే, ఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం ఒక్క ఓటు కూడా పడని సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కన ఎంత తక్కువగా ఓటర్లు వచ్చారో అర్థం చేసుకోవచ్చు. బహుశా ఈ సీన్ అలాంటి పోలింగ్ కేంద్రంలోనిదై ఉండొచ్చని చెబుతున్నారు.
ఇక ఎన్నికల అధికారుల తప్పిదం కారణంగా ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దయింది. బ్యాలెట్ పత్రం మీద సీపీఐ గుర్తు ఉండాల్సిన చోట సీపీఎం గుర్తును ముద్రించారు. ఈ విషయాన్ని గమనించిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అక్కడ రేపు రీ పోలింగ్ జరగనుంది. కొన్ని చోట్ల ఓటర్లకు స్లిప్పులు ఇవ్వకపోవడంతో వారు పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరుగుతున్నారు. తమ వద్ద ఉన్న డిజిటల్ స్లిప్పులను ఓటర్లు చూపిస్తున్నా.. అసలు మొబైల్ ఫోన్లకు అనుమతి లేదంటూ పోలింగ్ సిబ్బంది వారిని వెనక్కు పంపేస్తున్నారు. దీంతో పలుచోట్ల ఓటర్లు వెనుదిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు పోలింగ్ బూత్ ల దగ్గర ఘర్షణలు జరుగుతున్నాయి. హఫీజ్ పేట్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించారు. ఆర్కేపురం పోలింగ్ బూత్ లో ఘర్షణ చోటుచేసుకుంది. ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 1, 2020, 3:37 PM IST