ఆశ్చర్యం.. మదర్సాలో గోశాల.. 16 ఏళ్లుగా ఆవుల్ని పెంచి..

ఆవుల్ని పెంచి పోషిస్తున్న మదర్సా నిర్వాహకులు

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌ దగ్గర ఉన్న తుమ్డా గ్రామంలో ఒక మదర్సాలో 16 ఏళ్లుగా ఆవులన్ని పెంచి పోషిస్తున్నారు. పైగా, అక్కడికి వచ్చే పేద విద్యార్థులకు దేశ భక్తి పాఠాలు నేర్పుతూ వారిలో దేశంపై ప్రేమను రెట్టింపు చేస్తున్నారు.

  • Share this:
‘ముస్లింలు ఆవును చంపుకొని తింటారు.. ఉగ్రవాదాన్ని పెంచేలా మదర్సాల్లో చిన్నపిల్లలకు శిక్షణ ఇస్తారు..’ కొందరి అభిప్రాయం ఇది. కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌ దగ్గర ఉన్న తుమ్డా గ్రామంలో ఒక మదర్సాకు వెళ్లి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఇక్కడ, 16 ఏళ్లుగా ఆవులన్ని పెంచి పోషిస్తున్నారు. పైగా, అక్కడికి వచ్చే పేద విద్యార్థులకు దేశ భక్తి పాఠాలు నేర్పుతూ వారిలో దేశంపై ప్రేమను రెట్టింపు చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. 2003లో జామియా ఇస్లామియా అరేబియా పేరుతో ఒక మదర్సాను ప్రారంభించారు. అక్కడ విద్యార్థులకు పాఠాలు నేర్పుతూనే, పౌష్టికాహారం అందించేందుకు చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఓ గోశాలను ఏర్పాటు చేసి.. ఆవుల ద్వారా వచ్చే పాలను అక్కడి విద్యార్థులకు మాత్రమే అందజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని బయట అమ్మరు.

మదర్సాలో గోశాల


హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు కంప్యూటర్ విద్యను నేర్పుతున్నారు. దీనిపై ఆ మదర్సా డిప్యూటీ డైరెక్టర్ మౌలానా మహ్మద్ అహ్మద్ మాట్లాడుతూ.. ముస్లింలు ఆవులను పెంచుకోరని చాలా మంది భావిస్తారని, కొంతమంది ఆవును ప్రత్యేక మతానికి చెందినదిగా చూస్తారని.. అలాంటి వారు ఇక్కడికి వస్తే ఆశ్చర్యపోతారని తెలిపారు. ఇక్కడ 15 జాతులకు చెందిన ఆవులు ఉన్నాయని వెల్లడించారు. తమ మదర్సాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకున్నా తామే ఆ ఖర్చు భరిస్తున్నామని వివరించారాయన.

మదర్సా


ఆవుల సంరక్షణకు, వాటి చికిత్సకు, ఆహారం కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని మౌలానా తెలిపారు. స్థానిక ప్రజల సహాయంతో గోశాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎన్నో మదర్సాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.

First published: